భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి రాజధాని పరిసర గ్రామాల్లో పర్యటించారు. మంత్రుల ప్రకటనలతో గందరగోళంలో ఉన్న రైతులతో మాట్లాడురు. రాజధానిలో జరిగిన పనులు పరిశీలించారు. భాజపా నేతల మొదటగా రాయపూడిని సందర్శించారు.
రాష్ట్రానికి రాజధాని ఒక్కటే...సుజనా చౌదరి
వైకాపా మంత్రుల వ్యాఖ్యలు ప్రజలను గందరగోళపరుస్తున్నాయని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రాజధానిపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. రాజధాని అనేది రాష్ట్రానికి ఒక్కటే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి ఆత్రమే తప్ప పని మాత్రం జరగట్లేదు: కన్నా
రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధాని చేసిందన్న కన్నా... తాను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజధానికి మద్దతు పలికానని గుర్తుచేశారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పారని అన్నారు. మాట ఇచ్చాక వెనక్కుపోమని చెప్పే నేతలు ప్రతి విషయంలోనూ వెనక్కు పోతున్నారని ఆయన ఆరోపించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని...రాజధాని ప్రాంతంలో రైతులకు న్యాయం చేయాలని సీఎంకు లేఖ రాస్తే స్పందన లేదన్నారు. ప్రభుత్వానికి ఆత్రమే తప్ప పని మాత్రం జరగట్లేదని ఆయన విమర్శించారు. బాధ్యత కలిగిన సీఎం ముందుకొచ్చి రాజధానిపై స్పష్టత ఇవ్వాలని కన్నా డిమాండ్ చేశారు. ప్రజలను భయాందోళనకు గురిచేసే ప్రకటనలు చేయడం మంచిది కాదని సూచించారు. ప్రభుత్వంలో ఉన్నామనే భావన మర్చిపోయి ప్రతిపక్ష నేతల్లా మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అవినీతిపై మాట్లాడేవారు దాన్ని నిరూపించాలని సూచించారు. బాధ్యులను శిక్షించాలన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా అనవసర మాటలు ఎందుకు? అని ప్రశ్నించారు.ప్రజలు నమ్మి ఓటు వేస్తే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్లతో అమరావతిలో పనులు జరుగుతుంటే వాటిని గాలికి వదిలేశారని తెలిపారు.