ప్రభుత్వ స్థలాల విక్రయాన్ని నిరసిస్తూ.. గుంటూరులో జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ చేపట్టిన నిరాహారదీక్షకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు.
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కక్ష సాధింపు చర్యలు తప్ప వేరే లేవని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. నవరత్నాలు ఇస్తున్నామని చెప్పి అంతకు మించి ప్రజలపై భారం మోపుతున్నారని కన్నా ఆరోపించారు. చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్లిన విధంగా పరిస్థితి తయారైందన్నారు.
ఏడాది కాలంలోనే ప్రభుత్వ ఆస్తులు అమ్మే పరిస్థితికి తెచ్చారని ఎద్దేవా చేశారు. హైకోర్టు కూడా ప్రభుత్వం దివాలా తీసిందా అని ప్రశ్నించిందని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు కూడా వైకాపా కార్యాలయాల మాదిరిగా తయారయ్యాయని.. కోర్టు తీర్పులను ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారని కన్నా తెలిపారు.
అసలు విషయాలు పక్కదారి పట్టిస్తున్నారని... గతంలో తెదేపా కూడా ఇలాగే చేస్తే ప్రజలు సరైన తీర్పు చెప్పారని గుర్తు చేశారు. సమస్యలు పరిష్కరించండి... వాటికి సమాధానం చెప్పండి అని ప్రభుత్వానికి సూచించారు.
ఇవీ చదవండి:
భక్తులు ఇచ్చిన బంగారం కరిగిస్తే తప్పేముంది?: మంత్రి వెల్లంపల్లి