కరోనా వైరస్ నిర్ధరణ పరీక్ష, ఫలితంతో నిమిత్తం లేకుండా... లక్షణాలున్నా, అనారోగ్యం తీవ్రంగా ఉన్నా.... చికిత్స అందించాలన్న ప్రభత్వ ఆదేశాలు చాలాచోట్ల అమలు కావడం లేదు. తీవ్ర అనారోగ్య సమస్యలతో పెద్దాస్పత్రులకు వెళ్లినా... సమయానికి పడకలు కేటాయించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిఫార్సులు ఉంటే తప్ప చేర్చుకోవడం లేదంటూ.... కొన్ని ప్రాంతాల్లో బాధితులు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో 25 వేలకు పైగా పడకలు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తున్నా... బాధితులు నేరుగా ఆస్పత్రులకు వెళ్తుంటే చేర్చుకోవడం లేదు. అధికారంలో ఉన్నవారినో..., ఉన్నతాధికారులనో ఆశ్రయించి... వారితో ఫోన్లు చేయిస్తే తప్ప ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదు. పెద్దల ఆశీస్సులు లేని పేద, బడుగు వర్గాల వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గగనమైపోతోంది. ఆస్పత్రుల్లో బెడ్లు ఎన్ని ఉన్నాయో తెలిపే బోర్డులు చాలాచోట్ల కనిపించడం లేదు.
- అమ్మో.. ఒంగోలు జీజీహెచ్‌లోనా?
నెల్లూరు జీజీహెచ్లో చేరాలంటే అష్టకష్టాలు తప్పట్లేదని బాధితులు వాపోతున్నారు. ఊపిరాడని స్థితిలో వచ్చినా... వైరస్ నిర్ధరణ పరీక్ష చేయించుకుని రావాలని పంపిస్తున్నారని అంటున్నారు. సిఫార్సు లేకుంటే ఒంగోలు జీజీహెచ్లో అడ్మిషన్ దొరకడం గగనంగా మారిందని... బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తెలిసినవారితో ఫోన్ చేయిస్తే కానీ చేర్చుకోలేదని చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో చేర్చుకోవడానికి... కొన్నిసార్లు గంటలకొద్దీ సమయం పడుతోంది. బాధితుల వివరాలు నమోదు చేసుకుని చేర్చుకోవడానికి సమయం పడుతోందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఐతే... ఆస్పత్రిలో పడకల లభ్యత వివరాలు తెలిపే బోర్డు లేదు. తెనాలిలోని జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
- పడకలు ఉన్నా.. లేవని
కాకినాడ జీజీహెచ్లో.... పడకల సంఖ్య తెలిపే బోర్డులు లేవు. ఆస్పత్రిలో కరోనా వార్డులో సరిగ్గా చికిత్స అందించడం లేదని.... సరైన ఫాలో అప్ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఐసీయూలో పడకల కొరత ఉంది. రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ కొవిడ్ ఆస్పత్రిలో.... పడకలు ఖాళీలు ఉన్నా లేవని చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమలాపురం కిమ్స్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు గంటలకొద్దీ అంబులెన్సుల్లోనే వేచిచూడాల్సి వస్తోంది. రాజకీయ సిఫార్సులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనాతో.. లెక్కల మాస్టారు జీవన ప్రయాణం లెక్క తప్పింది..!