ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల బ్యాంక్ దోపిడీకి (bank Robbery ) పాల్పడి చివరకు కటకటాలపాలయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీకి యత్నించిన దంపతులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 6 కంప్యూటర్లు, డీవీఆర్, ఒక మానిటర్, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గూడూరు ప్రాంతానికి చెందిన దంపతులు భాస్కర్, భవాని హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోపన్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. నీళ్ల క్యాన్లు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భాస్కర్ పని చేసే చోటే అతని భార్య భవానీ పనిచేస్తోంది. తమ వద్ద ఉన్న రెండు వాహనాల్లో ఒకటి ఫైనాన్స్, రెండోది ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయడం వల్ల వారు ఉపాధి కోల్పోయారు.
ఓవైపు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే.. మరోవైపు ఉపాధి పోయింది. కరోనా వల్ల మరో ఉపాధి మార్గం కూడా దొరకలేదు. ఇక పొట్టకూటి కోసం చోరీ చేద్దామని నిర్ణయించుకున్నారు. భవానికి గచ్చిబౌలి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండటం వల్ల బ్యాంక్ దోడిపీ చేయాలని అనుకున్నారు. రెక్కీ నిర్వహించి బ్యాంక్ సెక్యూరిటీ వ్యవస్థ పటిష్ఠంగా లేదని నిర్ధరించుకున్నారు.
దోపిడీ(bank Robbery ) చేయడానికి బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడున్న కంప్యూటర్లు, డీవీఆర్, మానిటర్‌ను ఎత్తుకెళ్లారు. కానీ.. ఇదంతా అక్కడున్న సీసీకెమెరాలో రికార్డవుతుందని తెలుసుకోలేకపోయారు. చివరకు పోలీసులకు చిక్కారు. కటకటాలపాలయ్యారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారు చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
- ఇదీ చదవండి : మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన దుండగుడు