చంద్రబాబును చంపే యత్నం జరిగిందని మాజీమంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని తాను తిట్టలేదని..'ఓ మై సన్' అని చర్చ్‌లో ఫాదర్లు సంబోధిస్తారని.. అదేరీతిలో తెలుగులో అన్నానని స్పష్టం చేశారు. నా వ్యాఖ్యలపై కావాలనే వైకాపా శ్రేణులు రచ్చ చేస్తున్నాయన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
'ఇరిగేషన్ మంత్రి, పౌరసరఫరాల మంత్రులు చేస్తున్న పనులను బట్టే వారిని సంబోంధించానే తప్ప.. ఇందులో తిట్లు ఎక్కడ ఉన్నాయి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం పద్ధతి కాదు. ప్రతిపక్ష నేత, సీఎంగా చేసిన వ్యక్తికే రక్షణ లేకపోతే ఎలా?' -అయ్యన్నపాత్రుడు
డీజీపీకి తెలిసే చంద్రబాబు ఇంటిపై దాడి చేశారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.
అసలు వివాదం ఏంటి?
గురువారం మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ప్రధాన ద్వారం ముందు జోగి రమేశ్, వైకాపా కార్యకర్తలు బైఠాయించారు. దీంతో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల నినాదాలతో తోపులాట జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు యత్నించే క్రమంలో లాఠీఛార్జ్ చేశారు.
వైకాపా ఆందోళన సమాచారం తెలుసుకున్న పలువురు తెదేపా నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తోపాటు బుద్దా వెంకన్న, పట్టాభి తదితరులు అక్కడికి వచ్చి వైకాపా నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బుద్దా వెంకన్న సొమ్మసిల్లిపడిపోయారు. ఆందోళనకారుల దాడిలో ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు అద్దం ధ్వంసమైంది.
ఇదీ చదవండి: