మైనారిటీలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్సార్ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ముస్లింలకు 5 శాతం ఉన్న రిజర్వేషన్లు 4 శాతానికి పరిమితం చేశారని గుర్తుచేశారు. కడపలో మైనారిటీ అంగన్వాడి టీచర్‌పై దాడి, దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా వంటి పథకాల రద్దుపై సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. మైనారిటీలకు చేసిన అన్యాయాన్ని లాజిక్కులు, మ్యాజిక్కులు, కుట్రలు, కుతంత్రాలతో కప్పి పెట్టుకోవాలని చూడటం దారుణమని విమర్శించారు.
తెదేపా అధినేత చంద్రబాబు అబ్దుల్ కలాంను భారత రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తే, జగన్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. వృత్తిలో భాగంగా వివిధ రకాల కేసులను వాదించే న్యాయవాదులకు రాజకీయాలు ముడిపెట్టి సొంత మీడియాలో అసత్య ప్రచారం చేయటం మైనారిటీలకు చేసే మరో అన్యాయమని ఆక్షేపించారు. సలాం ఘటనకు సంబంధించి ప్రభుత్వ రిమాండ్ రిపోర్టును అత్యంత బలహీనంగా తయారు చేసి సరైన వాదనలు వినిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుటుంబం ఆత్మహత్యకు కారకులైన పోలీసులపై 302 సెక్షన్ కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని అచ్చెన్న నిలదీశారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే సలాం కుటుంబ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించటంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, బాధ్యులైన పోలీసులను డిస్మిస్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి