సెలక్ట్ కమిటీల ఏర్పాటుపై శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ పంపిన దస్త్రాన్ని మండలి కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీలు ఏర్పాటు చేయాలంటూ షరీఫ్ మండలి కార్యదర్శికి ఇటీవల దస్త్రాన్ని పంపగా.. అది నిబంధనలకు విరుద్ధమంటూ మండలి కార్యదర్శి దాన్ని తిప్పి పంపారు. మండలి ఛైర్మన్ మళ్లీ దాన్ని కార్యదర్శికి పంపినప్పటికీ తాజాగా రెండోసారి ఆయన తిప్పి పంపారు.
ఎందుకు వీలు కాదంటే..?
దస్త్రాన్ని మండలి ఛైర్మన్‌కి తిప్పి పంపుతూ.. బిల్లుల్ని సెలక్ట్ కమిటీలకు పంపడం ఎందుకు సాధ్యం కాదో వివరిస్తూ శాసనసభ కార్యదర్శి ఒక నోట్ రాశారు. 'బిల్లుల్ని సెలక్ట్ కమిటీ పంపడం అన్నది.. బిల్లును ఆమోదించాలని సభలో మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి సవరణ ప్రతిపాదించడం ద్వారా జరగాలే తప్ప.. సభ మూడ్‌ను బట్టి లేదా ఏకాభిప్రాయాన్ని బట్టి కాదు. సభా కార్యకలాపాల నిర్వహణలో ఛైర్మన్‌కి మార్గదర్శనం చేయడం, తోడ్పడడం కార్యదర్శి విధి. నిబంధనలు అమలులో లోపాలుంటే దాన్ని తెలియజెప్పడాన్ని ధిక్కారంగా భావించరాదు.' అని ఛైర్మన్‌కు పంపిన నోట్లో కార్యదర్శి పేర్కొన్నట్లు సమాచారం. సెలక్ట్ కమిటీని నియమించాల్సింది సభేనని.. దానిలో అధికార యంత్రాంగం వైఫల్యం లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న నిర్ణయం... నిబంధనల ప్రకారం జరగలేదని... ఆ అంశంపై తాను ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేనని పేర్కొన్నట్లు సమాచారం. అయితే గడువులోగా సెలక్ట్ కమిటీలు ఏర్పాటు కానందున బిల్లులు ఆమోదం పొందినట్లేనని, ఇక రావాల్సింది గవర్నర్ ఆమోదమేనని మంత్రులు, అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
కోర్టుకు వెళ్లే యోచనలో తెదేపా
శాసనసభ కార్యదర్శి దస్త్రాన్ని వెనక్కు పంపడంపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలా..? శాసన సభ కార్యదర్శికి సభా ధిక్కరణ నోటీసు ఇచ్చి చర్యలు చేపట్టాలా..? అన్న అంశంపై ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. కార్యదర్శి తీరు సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని.. దానిపై సభ్యులు ఎవరైనా నోటీసు ఇవ్వచ్చని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. దీనిపై ఏం చేయాలో పార్టీ పరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.:
ఇదీ చూడండి: