Right to Education Act: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో కల్పించే ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అనాథలకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని ఈ చట్టం అమలుకు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయించింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లను స్థానికంగా ఉండే పేదలకు కేటాయించాలి. ఈ విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజుల నిర్ణయానికి పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఛైర్మన్‌గా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం సమగ్రశిక్ష అభియాన్ కార్యాలయంలో సమావేశమైంది.
అనాథలు, దివ్యాంగులు, తల్లి లేదా తండ్రి ఉన్న వారికి 5శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 4శాతం, మైనారిటీలు, బీసీ, ఓసీలకు కలిపి 6శాతం చొప్పున 25శాతం సీట్లను కల్పించాలని కమిటీ నిర్ణయించింది. వీటిని ఆయా కుటుంబాల ఆదాయం ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై చేస్తున్న వ్యయాన్ని మొదట నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు. దీని ఆధారంగా ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు చెల్లించాలని ప్రాథమిక నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపైనా చర్చించారు. ప్రస్తుతం అన్ని కలిపి ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై చేస్తున్న వ్యయం రూ.42,500 ఉండగా.. దీంట్లో మౌలిక సదుపాయాలు ఇతరత్రా వ్యయాలు కలిపి ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయుల జీతాలు, శిక్షణలాంటి వాటిపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఆధారంగా ఒక్కో విద్యార్థిపై చేస్తున్న వ్యయాన్ని అధికారులు లెక్కించనున్నారు.
ఇదీ చదవండి: అప్పుల ఊబిలో కూరుకుపోతోన్న రాష్ట్రం... రుణ భారం 7.76 లక్షల కోట్లు?