Swaroopanandendra Will Soon Leave State And Stay in Rishikesh : విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ క్యాటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని పీఠం మేనేజర్ ఏపీ డీజీపీని ఓ లేఖ ద్వారా కోరారు. ఈ క్రమంలో ఇకపై ఆయన రుషికేశ్‌లో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారని తెలియజేశారు. స్వామీజీ స్వరూపానందేంద్రకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 'వై' క్యాటగిరీ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పీఠాధిపతితోపాటు ఉత్తరాధికారికీ ఓ గన్‌మెన్ ఉండేవారు.
గతంలో స్వామిజీ ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక 'వై' క్యాటగిరీ భద్రత నిలిపివేసింది. ప్రస్తుతం వారికి వన్ ప్లస్ వన్ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శారదా పీఠానికి రూ. 300 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ. 15 లక్షలకే అప్పగించగా, కూటమి ప్రభుత్వం ఇటీవల ఆ కేటాయింపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజగురువులా ఓ వెలుగు వెలిగిన స్వరూపానందేంద్ర త్వరలో రాష్ట్రాన్ని వీడి రుషికేశ్‌లోనే ఉంటారనే ప్రచారం జరుగుతోంది.