ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశించిన మూలధన వ్యయ లక్ష్యాన్ని ఏడు రాష్ట్రాలు మాత్రమే చేరుకున్నాయి. వాటికి ప్రోత్సాహకంగా మొత్తం రూ.16,691 కోట్ల రుణాన్ని పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం శుక్రవారం అనుమతిచ్చింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు.
అయితే సెప్టెంబరు నెలాఖరు వరకు 22 రాష్ట్రాల మూలధన వ్యయ వివరాలను వ్యయ విభాగం సమీక్షించిందని, మిగతా ఆరు రాష్ట్రాలకు సంబంధించి కాగ్ నుంచి వివరాలు అందాక సమీక్షిస్తుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) శుక్రవారం దిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆ ఆరు రాష్ట్రాల పేర్లు, వివరాలు వెల్లడించలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం రెండో త్రైమాసికం చివరికి మూలధన వ్యయ లక్ష్యాన్ని 45 శాతానికి చేరుకున్న రాష్ట్రాలే అర్హత సాధించాయి.
కాగ్ తాజా నివేదిక అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ సెప్టెంబరు నెలాఖరుకి రూ.6,711.60 కోట్లు మాత్రమే మూలధన వ్యయం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీకి కేంద్ర వ్యయ విభాగం రూ.27,589 కోట్లు మూలధన వ్యయ లక్ష్యంగా నిర్ణయించి, ఆ తర్వాత దాన్ని రూ.26,262 కోట్లకు తగ్గించింది. ఆ లెక్కన రెండో త్రైమాసికానికి సంబంధించి రుణానికి అర్హత సాధించాలంటే రాష్ట్రం రూ.11,817.90 కోట్లు ఖర్చు చేసి ఉండాలి. ఇప్పుడు కేంద్రం సమీక్షించిన 22 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉందా? లేదా? అన్న వివరాలు పీఐబీ ప్రకటనలో లేవు.
ఇప్పుడు ఎంపికైన వాటిల్లో ఛత్తీస్‌గఢ్‌కు రూ.895 కోట్లు, కేరళ రూ.2,256 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.2,590 కోట్లు, మేఘాలయ రూ.96 కోట్లు, పంజాబ్ రూ.2,869 కోట్లు, రాజస్థాన్ రూ.2,593 కోట్లు, తెలంగాణకు రూ.5,392 కోట్లు అదనపు రుణం పొందేందుకు అనుమతిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్నందుకు... రూ.2,655 కోట్ల రుణం పొందేందుకు సెప్టెంబరు మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర వ్యయ విభాగం అనుమతిచ్చింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలు అర్హత సాధించాయి. వాటికి రూ.15,721 కోట్లు అదనపు రుణం తెచ్చుకునేందుకు వ్యయ విభాగం అనుమతిచ్చింది. ఇప్పుడు రెండో సమీక్షలో ఏడు రాష్ట్రాలకు ఇచ్చిన రూ.రూ.16,691 కోట్లు కలిపి... ఇంతవరకు మొత్తం రూ.32,412 కోట్ల రుణానికి అనుమతిచ్చినట్లయింది. మూడో సమీక్ష మార్చి నెలలో జరుగుతుంది. అప్పుడు మొదటి మూడు త్రైమాసికాల్లో 70 శాతం మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు... మొత్తంగా జీఎస్‌డీపీలో 0.5 శాతం రుణపరిమితికి అనుమతిస్తుంది. నాలుగో సమీక్ష 2022 జూన్‌లో జరుగుతుంది. ఏ రాష్ట్రమైనా నూరుశాతం మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకోకపోతే... ఆ మేరకు తదుపరి ఆర్థిక సంవత్సరం రుణపరిమితిలో కేంద్రం కోత పెడుతుంది.
ఇదీ చదవండి : మద్యం అమ్మే కంపెనీకి.. ప్రజల సంక్షేమ బాధ్యత!!