Apex Council Meet: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీజలాల వివాదాలపై ఏర్పాటైన అత్యున్నత మండలి మూడో సమావేశం త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించి గత జులై 15న జారీచేసిన నోటిఫికేషన్ అమలు పురోగతిని సమీక్షించేందుకు అపెక్స్ కౌన్సిల్‌ను సమావేశపరిచేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ సమాయత్తమవుతోంది. ఈ దిశగా ఇప్పటికే జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, అధికారులు కసరత్తు చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో డిసెంబర్ 28న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై సీఎస్‌లతో చర్చించిన కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్... అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజెండాపైనా చర్చించారు.
ఆ ప్రాజెక్టుల డీపీఆర్... సీఐఎస్ఎఫ్ భద్రత..
కొత్త రాష్ట్రానికి నీటి కేటాయింపుల కోసం ట్రైబ్యునల్‌కు నివేదించాలన్న విజ్ఞప్తి, గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్ ల ఆమోదం, ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాల భద్రత అంశాలపై అత్యున్నత మండలి సమావేశంలో చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రతిపాదించారు. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే ప్రక్రియని వేగవంతం చేయాలని పంకజ్ కుమార్ చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను ప్రాధాన్యంగా పరిగణించాలని తెలిపారు. ఆ తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో జనవరి 27న దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి.. బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు పురోగతిపై చర్చించారు.
ఇతర అంశాలుంటే చెప్పండి..
ఈ అంశాల ఆధారంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అత్యున్నత మండలిని త్వరలోనే సమావేశపరచాలని భావిస్తున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కేంద్ర జల్‌శక్తిశాఖ సమాచారం పంపింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై సమీక్షించేందుకు అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని ప్రతిపాదించారు. సమావేశంలో చర్చించేందుకు ఇతర అంశాలు ఉంటే వాటిని పంపాలని రెండు రాష్ట్రాలను కోరారు.
ఇదీచూడండి: NHRC: ఏపీ సీఎస్, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు