ఆరు విడతలుగా ఉచిత రేషన్ అందుకుంటున్న కార్డుదారులకు జులైలో తీసుకునే సాధారణ రేషన్ భారం కానుంది. కందిపప్పుపై 67.5, పంచదారపై 70శాతం చొప్పున ధరలు పెరగనున్నాయి. ఇంతకు ముందు మార్కెట్లో ఎంత ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ కిలో కందిపప్పును రూ.40, పంచదారను రూ.20చొప్పున అందించేవారు. ఇకపై మార్కెట్లో ధర ఎంతున్నా 25శాతం రాయితీకే పరిమితం కావాలని ప్రభుత్వం నిర్ణయించటంతో ధరలు పెరగనున్నాయి. జులై నుంచే పెంచిన ధరల్ని అమలు చేయాలని కిలో కందిపప్పు రూ.67, పంచదార రూ.34 చొప్పున అమ్మాలని పౌర సరఫరాల శాఖ సూచించింది. ఏడాదంతా ఇవే అమలైతే పేదలపై ఏడాదికి రూ.550.80 కోట్ల భారం పడనుంది.
కంది పప్పు, పంచదార ధరల్ని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో సమీక్షించింది. మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించాలని, అప్పుడు ఉన్న ధరలపై 25శాతం రాయితీ ఇవ్వాలని ఫిబ్రవరిలోనే నిర్ణయించారు. ఇంతలో కరోనా ప్రభావం తీవ్రమైంది. మార్చి నెలాఖరు నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. పేదలకు ఉచితంగా నిత్యావసరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే నెలకు రెండు సార్లు చొప్పున మొత్తం ఆరు సార్లు బియ్యం, కందిపప్పు, సెనగల్ని ఉచితంగా అందించారు. దీంతో ధరల పెంపు అమలు కాలేదు. జులై నుంచి సాధారణ రేషన్ పంపిణీ ప్రారంభం మొదలుకాబోతోంది. పెంచిన ధరల్ని వచ్చేనెల నుంచి అమలు చేయబోతున్నారు.
ఇవీ చూడండి-'రేషన్ బియ్యం కూడా కులాల వారీగా ఇస్తారేమో'