ఏడేళ్లు, ఆపై వయోధికుల అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది. 66.4శాతం అక్షరాస్యతతో దేశంలో 22వ స్థానంలో నిలిచింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల కంటే దిగువకు పడిపోయింది. జాతీయ గణాంక కార్యాలయం ఈ ఏడాది జులై చివర్లో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. జులై 2017 నుంచి జూన్ 2018 వరకు చేపట్టిన సర్వే వివరాలను ‘భారతదేశంలో విద్యపై గృహ వినియోగం’ పేరుతో నివేదిక రూపొందించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీ అక్షరాస్యత 67.4% కాగా, ఈ నివేదికలో 66.4 శాతంగా తేల్చింది. ఇది జాతీయ సగటు అక్షరాస్యత (77.7%) కంటే తక్కువ. ఈ ఏడాది వాయిదా పడిన జనాభా లెక్కలు పూర్తయితే వాస్తవ గణాంకాలు వెల్లడయ్యే అవకాశం ఉండేది.
గ్రామీణంలో 60.4శాతమే
రాష్ట్రంలో గ్రామీణ పురుషుల్లో 67.5 శాతం, మహిళల్లో 53.4 శాతం మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. పట్టణాలు, నగరాల్లోని పురుషుల్లో 86.3%, మహిళల్లో 73.1% చదువుకున్నవారు ఉన్నారు. గ్రామీణంలో సగటు అక్షరాస్యత 60.4% కాగా, పట్టణాల్లో 79.6%గా ఉంది. గ్రామీణం, పట్టణాల్లో కలిపి పురుషుల్లో 73.4%, మహిళల్లో 59.5% మంది అక్షరాస్యులుగా లెక్క తేలింది. పురుషులు, మహిళల అక్షరాస్యతలో పట్టణాల కంటే పల్లెల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు 82.9%, ఒడిశా 77.3%, కర్ణాటక 77.2%, తెలంగాణ 72.8% సగటు అక్షరాస్యత కలిగి ఉన్నాయి.
ఇదీ చదవండి: