నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అరెస్ట్ విషయంలో రెండు వారాలపాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, అనిశా డిజీ, సీఐడీ అదనపు డీజీలను ఆదేశించింది. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
తనను ఏదో రకంగా అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారని, అందువల్ల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ....ఐపీఎస్ అధికారి ఏబీ వెంకేటశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ...రాష్ట్రప్రభుత్వ వ్యవహారశైలిని మెుదటి నుంచి గమనిస్తే పిటిషనర్‌ను అరెస్ట్ చేస్తారనే సహేతుకమైన ఆందోళన ఉందన్నారు. అరెస్ట్ చేసి మళ్లీ సస్పెండ్ చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. అరెస్ట్‌పై ఆందోళనతో గతంలోనూ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుతానికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు.
ఇదీ చదవండి
కిడ్నాప్ కేసు : భూమి ధర పెరిగింది.. గుడ్‌విల్ కోసమే బెదిరింపులు!