High Court On Visakha Land Issue: విశాఖ జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను నిలువరించాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయకపోవడంపై ఆ కలెక్టర్ మల్లిఖార్జున హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదన్నారు. కె.దుర్గాప్రసాద్ అనే వ్యక్తి సర్వే నంబరు 266లో ఉన్న ప్రైవేటు స్థలంలో నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు. వివిధ సర్వే నంబర్ల పరిధిలో అక్కడి భూమి ఉందన్నారు. కోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను నిలువరించామని వివరించారు.
ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యవహారం మొత్తంపై నిర్వహించిన సర్వే నివేదికను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. మరోవైపు కలెక్టర్ అఫిడవిట్ వేయాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేస్తూ.. ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని కలెక్టర్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని తెలియకపోతే ఎలా అని ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
విశాఖ జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని సర్వే నంబరు 255, 271, 272లోని 8 ఎకరాల భూమిలో కె.దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై భవన నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంటూ.. విశాఖకు చెందిన ఎస్.చిన వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు .. సంబంధిత భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గతంలో జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయని, కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ వ్యవహరించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది అక్బర్.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో కలెక్టర్ వ్యక్తిగత హాజరుకు ధర్మాసనం ఆదేశించింది. సోమవారం విచారణకు హాజరైన కలెక్టర్ మల్లిఖార్జున.. నేరుగా కోర్టుకు వివరాలు సమర్పించారు. పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
ఇదీ చదవండి..
HIGH COURT HEARING : "ప్రైవేటు విద్యాసంస్థల్లో పేదలకు 25 శాతం సీట్లు.."