పాఠశాలల అభివృద్ధి కోసం లక్షల రూపాయల విరాళాలు తీసుకుని దాతలు, వారు సూచించిన పేర్లను బడులకు పెట్టకపోవడం సమర్థనీయం కాదని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విరాళమిచ్చిన పలువురు దాతలు.. ఆయా బడులకు తాము సూచించిన పేర్లు పెట్టడం లేదంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రాథమిక పాఠశాలకు రూ. 5 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 7 లక్షలు , ఉన్నత పాఠశాలకు రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తే దాతలు సూచించిన పేర్లు పెట్టుందుకు వీలుగా 2004 నవంబర్ 14న రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ఆ నిబంధనల మేరకు విరాళాలు ఇచ్చినా పిటిషర్లు సూచించిన పేర్లు పెట్టడం లేదని కోర్టుదృష్టికి తీసుకొచ్చారు.
ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. రాష్ట్రంలో ఇలాంటి వ్యవహార శైలి కొనసాగితే విరాళాలు ఇవ్వడానికి, పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి ఎవరూ ముందుకురానని స్పష్టంచేశారు . ప్రభుత్వ తీరుతో అంతిమంగా రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. పాఠశాలలకు దాతల పేర్లు పెట్టేందుకు అడ్డంకిగా ఉన్న 2021 అక్టోబర్ 6 నాటి జీవో 13ను పరిగణనలోకి తీసుకోకుండా పిటిషనర్లు సూచించిన పేర్లను రెండు వారాల్లో పాఠశాలలకు పెట్టాలని తీర్పు ఇచ్చారు.
ఇదీ చదవండి: అసని ఎఫెక్ట్‌తో.. మరోసారి నిండామునిగిన అన్నదాతలు