సహాయ, సహకారాలు అందించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పేర్కొంటూ ఎస్‌ఈసీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో.. పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అప్పటి ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్నీ, ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. మరోవైపు గతంలో తామిచ్చిన ఉత్తర్వుల అమలుపై స్థాయి నివేదిక దాఖలు చేయకపోతే పూర్వ సీఎస్ నీలం సాహ్నీ.. తదుపరి విచారణకు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని స్పష్టంచేసింది.
ఎస్‌ఈసీ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ వ్యాజ్యం 42 రోజులు విచారణకు నోచుకోకపోవడానికి బాధ్యులైన హైకోర్టు రిజిస్ట్రీకి చెందిన అధికారులపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్ జనరల్(ఆర్‌జీ)ని ఆదేశించింది. ప్రభుత్వాధికారులైనా.. కోర్టు అధికారులైనా న్యాయస్థానానికి సమానమేనని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు. ఎస్‌ఈసీకి సహాయసహకారాలు అందించాలని 2020 నవంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులను అమలు చేయని కారణంగా బాధ్యులైన అధికారులను శిక్షించాలని ఎస్‌ఈసీ గత డిసెంబర్ 18న కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేసింది.
వార్తలు ప్రచురణతో మీ ఉద్దేశం నెరవేరిందని భావించినట్లున్నారు: న్యాయమూర్తి
డిసెంబర్ 18న దాఖలు చేసిన కోర్టుధిక్కరణ వ్యాజ్యం 42 రోజుల వరకు విచారణకు ఎందుకు నోచుకోలేదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. రిజిస్ట్రీ పొరపాటు వల్ల విచారణకు రాలేదా లేక.. మీరు పట్టించుకోలేదా? అన్నారు. ఎస్‌ఈసీ వేసిన కోర్టుధిక్కరణ వ్యాజ్యం 42 రోజులు నంబరు కాకపోతే కోర్టు విధుల్ని అడ్డుకున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం అని వ్యాఖ్యానించారు. అధికారులు నిజంగా సహకరించకపోతే అన్ని రోజులు ఎస్‌ఈసీ ఎందుకు మౌనంగా ఉందన్నారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. రిజిస్ట్రీతో పర్యవేక్షణలో ఉన్నామన్నారు. సంబంధిత దస్త్రాలను అప్‌లోడ్ చేశామని చెప్పారు. అత్యవసర విచారణ అవసరం లేదని చెప్పడం లేదన్నారు.
న్యాయమూర్తి స్పందిస్తూ కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసిన మరుసటి రోజు(డిసెంబర్ 19న) అఫిడవిట్‌లోని అన్ని వివరాలతో పత్రికల్లో కథనాలు ప్రచురితం అయ్యాయని గుర్తు చేశారు. వార్తల ప్రచురణతో మీ ఉద్దేశం నెరవేరినట్లు భావించినట్లున్నారు.. అందుకే వ్యాజ్యాన్ని విచారణకు తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోలేదా? అని ప్రశ్నించారు. ప్రచారం కోసం కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారా? లేక కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని వాస్తవంగా అధికారులు అమలు చేయనందుకు వేశారా? అని వ్యాఖ్యానించారు. దీనికి ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది బదులిస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎస్‌ఈసీ పలు విషయాల్లో పోరాటం చేస్తోందన్నారు. అన్ని విషయాల్ని బయటకు చెప్పుకోలేని స్థితి అన్నారు.
అఫిడవిట్‌పై కమిషనర్ సంతకం ఏమిటి?
రాజ్యాంగ సంస్థ అయిన ఎస్‌ఈసీ వేసిన వ్యాజ్యంలో అఫిడవిట్‌పై కార్యదర్శి సంతకం ఎందుకు పెట్టడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎందుకు సంతకం చేస్తున్నారన్నారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ బదులిస్తూ.. గత కార్యదర్శి ఎస్‌ఈసీకి సహకారం అందించలేదన్నారు. ఆ కార్యదర్శిని మార్చాలని ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. అఫిడవిట్‌లపై కార్యదర్శి సంతకం పెట్టడానికి అంగీకరించకపోతే.. క్రమశిక్షణాచర్యలు ఏమైనా తీసుకున్నారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశామని న్యాయవాది తెలిపారు. న్యాయస్థానంలో వ్యాజ్యాలకు నంబరు కాకముందే, విచారణకు రాకముందే.. పిటిషన్‌లోని వివరాల్ని మీడియాకు విడుదల చేయవద్దని మీ క్లైంట్(ఎస్‌ఈసీ)కి సలహా ఇవ్వాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదికి న్యాయమూర్తి సూచించారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఎన్నికల కమిషన్ కాని, తాను కాని వ్యాజ్యాల్లో విషయాన్ని.. మీడియాకు ఎప్పుడూ విడుదల చేయలేదన్నారు.
ఇదీ చదవండి: