High Court serious on Government: ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ (ఏపీఏటీ) నుంచి హైకోర్టుకు డిప్యుటేషన్‌పై వచ్చి పనిచేస్తున్న సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు బదిలీ చేయడంపై హైకోర్టు మండిపడింది. తమను సంప్రదించకుండానే సిబ్బందిని ఉపసంహరించడం ద్వారా హైకోర్టు కార్యకలాపాలను బలహీనపరచాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదంటూ, బదిలీ ప్రక్రియను నిలిపివేసింది. ప్రభుత్వ తీరుపై సంతోషంగా లేమని ఆక్షేపించింది. ఏపీఏటీని రద్దు చేశాక అక్కడి నుంచి 70 మంది డిప్యుటేషన్‌పై హైకోర్టుకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. వారిని వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు(సరెండర్) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియను సవాలుచేస్తూ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పిల్ దాఖలుచేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.
ఉన్నది మూడో వంతు సిబ్బందే
పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఎస్.ప్రణతి, జి.బసవేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ‘ఏపీ హైకోర్టుకు మంజూరైన మొత్తం పోస్టుల సంఖ్య 990. ఏపీఏటీ నుంచి వచ్చిన 70 మంది ఉద్యోగులతో కలుపుకొని ప్రస్తుతం 365 మంది పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. వీరిని బదిలీ చేస్తే హైకోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బదిలీలను నిలువరించండి’ అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, ఎస్‌జీపీ సుమన్, కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదిస్తూ.. ‘ఏపీఏటీ ఉద్యోగులను హైకోర్టులోకి తీసుకునేందుకు నిబంధనలు అనుమతించవు. వీరి బదిలీకి ఇంకా జీవో ఇవ్వలేదు. ఈ ప్రక్రియకు సంబంధించి లేఖ ద్వారా గతంలోనే రిజిస్ట్రీని సంప్రదించాం. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వండి’ అని అభ్యర్థించారు.
ఏజీకి అవగాహన ఉండటం లేదు
ధర్మాసనం స్పందిస్తూ, ‘ప్రభుత్వ వ్యవహార శైలి.. మేం కోర్టులో ఘాటుగా మాట్లాడే పరిస్థితులు కల్పిస్తోంది. ఈ తీరుపై మేం సంతోషంగా లేం. ప్రస్తుతం 40 శాతం సిబ్బందితోనే హైకోర్టు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం. వారి బదిలీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోబోతోందని డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు మా ఛాంబర్‌కు వచ్చి చెబుతున్నారు. అడ్వకేట్ జనరల్(ఏజీ)కు, హైకోర్టుకు ఈ సమాచారం ఉండటం లేదు. ఉద్యోగులకు మాత్రం అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. ఈ పద్ధతి చూస్తుంటే ప్రభుత్వం తగిన విధంగా పనిచేస్తుందా? అనే సందేహం కలుగుతోంది. ప్రభుత్వం ఏం చేస్తుందో ఏజీకి కూడా అవగాహన ఉండటం లేదు’ అని వ్యాఖ్యానించింది. ఉద్యోగుల బదిలీ ప్రక్రియను నిలుపుదల చేసిన ధర్మాసనం.. డీవోపీటీ సంయుక్త కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీచేసింది.
ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం.. రూ.7.76 లక్షల కోట్లకు చేరిన చెల్లింపుల భారం