ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల హక్కులకు సీఆర్డీఏ రద్దు చట్టంలో రక్షణ కల్పించారని...వారి హక్కులకు భంగం వాటిల్లదని న్యాయస్థానానికి తెలియజేశారు. ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనం కంటే ప్రజాప్రయోజనానికే అధిక ప్రాధాన్యమన్న సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. చట్టబద్ధమైన నిరీక్షణ ఫలితం తమకు దక్కదన్న కారణంగా... రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను పిటిషనర్లు, రైతులు సవాలు చేయడానికి వీల్లేదన్నారు.
రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తుది విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫు వాదనల కొనసాగింపునకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రెండో రోజు విచారణలో భాగంగా ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలను కొనసాగించారు. ప్రజాప్రయోజనం కోసం ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోకూడదన్నారు. సుపరిపాలనను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సమగ్రాభివృద్ధి కొరకు ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలుంటాయని.... అమరావతి బృహత్తర ప్రణాళిక మార్చడానికి వీల్లేదని పిటిషనర్లు చెప్పడం సరికాదన్నారు. గతంలో మాస్టర్ ప్లాన్ను మార్చిన సందర్భాలున్నాయన్న శ్రీరామ్... పలు సుప్రీంకోర్టు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: