HIGH COURT ON LOK ADALAT WORKING: లోక్ అదాలత్‌ల ద్వారా సామరస్యపూర్వకంగా వివాదాలను పరిష్కరించే క్రమంలో వివరాలన్నింటిని పరిశీలించకుండా అవార్డులు జారీ చేస్తే.. అవి బహుళ వివాదాలకు కారణమవుతాయని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి వాటి వల్ల లోక్ అదాలత్ చట్ట ఉద్దేశం నెరవేరదంటూ.. సబార్డినేట్ అధికారులు అనుసరించాల్సిన విధానాన్ని స్పష్టంచేస్తూ ఆదేశాలు జారీచేసింది. లోపభూయిష్టంగా అవార్డుల జారీపై ఆక్షేపించింది.
కేసులను పరిష్కరించే సభ్యులు దావాకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించాలని.. సివిల్ కోర్టు దావాలో ఉన్న కక్షిదారులందరూ లోక్ అదాలత్‌లో పార్టీలుగా ఉన్నారా లేదా చూడాలని స్పష్టం చేసింది. ఉత్తర్వులు జారీ చేసిన దగ్గర్నుంచి కనీసం మూడేళ్ల పాటు వాటిని భద్రపరచాలని.. ఇతర కోర్టుల్లో ఏమైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయా ? అక్కడ ఏమైనా ఉత్తర్వులు వెలువడ్డాయా ? తదితర వివరాలను కక్షిదారుల నుంచి లోక్ అదాలత్ సభ్యులు తెలుసుకోవాలని సూచించింది.
వైవాహిక వివాదం ఉన్న నేపథ్యంలో భార్య తనకు తెలియకుండా తాను కొనుగోలు చేసిన 1.02 ఎకరాలను మరొకరికి విక్రయించడం, ఆ తర్వాత అదే వ్యక్తితో కుమ్మకై లోక్‌అదాలత్ ద్వారా అవార్డు పొందారని పేర్కొంటూ.. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన నరసింహారావు అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తనకు నోటీనులు ఇవ్వకుండా లోక్ అదాలత్ అవార్డు జారీచేసిందని.. దానికి కొట్టేయాలని కోరారు. ఆ వ్యాఖ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ ఉత్తర్వులను రద్దుచేసింది. వివాదాన్ని సివిల్ కోర్టుకు తిప్పిపంపింది.
ఇదీ చదవండి: Public Opinion on ACCMC: '29 గ్రామాలను కలిపే ఉంచాలి... విడగొడితే ఒప్పుకునేది లేదు'