సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్లైన్లో విక్రయించేందుకు వీలుగా గతేడాది తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని, టికెట్ల విక్రయ నిర్వహణను ఏపీ స్టేట్, ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌కు అప్పగిస్తూ డిసెంబర్ 17న జారీచేసిన జీవో 142ను సవాలు చేస్తూ మల్టీఫెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ తరఫున మంజీత్ సింగ్, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. టికెట్లు ఆన్లైన్లో విక్రయించేందుకు వీలుగా చట్టంలో సెక్షన్ 5 ( ఏ )ను కొత్తగా చేరుస్తూ సవరించారన్నారు. ఆ నిర్ణయాన్ని సవాలు చేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆన్లైన్లో విక్రయ నిర్ణయంలో తప్పేముందని ప్రశ్నించింది. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వమే టికెట్లను విక్రయిస్తే గుత్తాధిపత్యానికి దారితీస్తుందని సీనియర్ న్యాయవాది బదులిచ్చారు. ఇప్పటి వరకు జరుగుతున్న విక్రయ విధానంలోనూ పారదర్శకత పాటించామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. పన్ను ఎగవేతను కట్టడి చేయడం కోసం ఆన్లైన్ విధానం అని వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాది మరోసారి స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయం థియేటర్ల యాజమాన్యాల ప్రాథమిక హక్కులను హరించడమేనన్నారు. చాలా మంది సినీ ప్రేక్షకులకు ఆన్లైన్లో టికెట్ బుక్ చేయించుకోవడం తెలీదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రపంచం అంతా ఆన్లైన్ ద్వారా పనిచేస్తుందని, సినిమా చూడాలనుకుంటున్న వాళ్లకు ఎలా బుక్ చేసుకోవడమే కాదు. ఆన్లైన్లో ఎలా చూడాలో కూడా తెలుసని వ్యాఖ్యానించింది. ఆన్లైన్ గురించి ప్రజలకు తెలీదు అనుకోవడం పొరపాటని పేర్కొంది. ప్రభుత్వం కౌంటర్ వేశాక పూర్తి స్థాయి విచారణ జరుపుతామని పేర్కొంటూ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
దగ్గుబాటి సురేష్ బాబుకు నోటీసులు..
సినిమా టికెట్లు ధరలపై హైకోర్టు లోగడ ఇచ్చిన ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతున్నారంటూ న్యాయవాది జీఎల్ నరసింహారావు హైకోర్టులో వ్యాజ్యం వేసి నేరుగా వాదనలు వినిపించారు. ఎప్పటినుంచో జరుగుతున్న టికెట్ అధిక ధరల విక్రయం వెనక రూ.2లక్షల కోట్ల కుంభకోణం ఉందని వివరించారు. ధరలను నిర్ణయిస్తూ గతేడాది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో35ను రద్దు చేయాలని కోరారు. సినీ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన సినిమా థియేటర్ యజమానులు పలుమార్లు హైకోర్టును ఆశ్రయించి న్యాయస్థానం విచారణను దుర్వనియోగం చేశారని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి , తెలుగు ఫిల్మ్‌ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గుబాటి సురేశ్ బాబుకు నోటీసులిచ్చింది. అవి అందాక తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: AP News: ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేసిన పోలీసులు