కొవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య, వాలంటీర్ సిబ్బంది కాంటాక్ట్ ట్రేసింగ్ సర్వే నిర్వహిస్తుంటే వారిపై భౌతికదాడుల జరగడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. కరోనా రోగుల మృతదేహాల్ని ఖననం చేసే సమయంలో.. దహన వాటికల్లోనూ దాడులు చేస్తుండటాన్ని సహించబోమని తేల్చిచెప్పింది. కేంద్రప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకారం విధుల్లో ఉన్న వైద్య, వైద్యేతర సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే ఎపిడమిక్ డిసీజ్ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్ఫష్టం చేసింది. ఈ యాక్టు ప్రకారం వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని గాయపరిస్తే వారికి 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించింది. నష్టపరిచిన ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
అపోహాలు వద్దు...
వైరస్ వ్యాప్తిపై లేనిపోని అపోహాలతో వైద్యసిబ్బంది విధులకు ఆటంకం కలిగించొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంబంధీకుల సర్వే పూర్తి చేసి, పరీక్షలు చేయటం ద్వారానే వ్యాధి నివారణ త్వరితగతిన సాధ్యమవుతుందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్ వ్యాధిగ్రస్థుల మృతదేహాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం స్టెరిలైజ్ చేసి సీల్ చేస్తారని వెల్లడించింది. పార్థివదేహాల్ని పూడ్చటం లేదా కాల్చటం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని తెలిపింది. ప్రజలందరూ దీన్ని అవగాహన చేసుకొని.. సమాజ హితం కోసం నిరంతరం పాటు పడే వైద్య సిబ్బందికి సహకరించాలని ప్రభుత్వం కోరింది.
ఇదీ చూడండి ..