రాష్ట్రంలో పాడి పారిశ్రామిక రంగం అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో.. అమూల్, ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీ డైరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ వాణీ మోహన్, అమూల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మంచి ధర.. నాణ్యమైన ఉత్పత్తులు
పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు, వినియోగదారులకు పాల ఉత్పత్తులను సరసమైన ధరలకు అందుబాటులో తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. పాడి పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు, సాంకేతికతను వినియోగించనున్నారు.
చరిత్రాత్మక అడుగు
రాష్ట్రానికి, అమూల్‌కు మధ్య ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అడుగని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. పాల ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్ర నాలుగో స్థానంలో ఉందని.. కానీ కేవలం 24 శాతం పాలు మాత్రమే వ్యవస్థీకృత రంగానికి వెళ్తున్నాయని అన్నారు. ఫలితంగా పాడి రైతుల కష్టానికి తగ్గ ధరలు లభించడం లేదని.. ఈ పరిస్థితి మారాలని చెప్పారు.
మహిళా సాధికారతే లక్ష్యం
పాడి పశువుల పెంపకం, డెయిరీల నిర్వహణలో సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సహకార సంఘాల్లో మహిళలకు అపార అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా మహిళా సాధికారత, వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపింది.
రాబోయే రోజుల్లో 10,641 రైతు భరోసా కేంద్రాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగానికి సంబంధించి మరిన్ని గొప్ప ఆలోచనలు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
మహిళలకు ఆసరా
వైయస్సార్ ఆసరా, చేయూత కింద మహిళలకు వచ్చే నాలుగేళ్లలో రూ.44 వేల కోట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ సహాయం వారి జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలని సూచించారు. అమూల్‌తో భాగస్వామ్యంతో మహిళలకు మరింత చేదోడుగా ఉంటుందని.. ప్రభుత్వ సహకార డెయిరీలకు మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు
ఇదీ చదవండి:
రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు వివరించా: ఎంపీ రఘురామకృష్ణరాజు