కరోనా సెకండ్ వేవ్ ప్రైవేట్ ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. కనీస మానవత్వం మరిచి కరోనా రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులను అదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే.. మొదటిసారి 10 రెట్లు జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రెండోసారి అదే తప్పు చేస్తే ఏకంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రైవేట్, కార్పొరేట్ హస్పటల్స్ కొన్ని.. ఆరోగ్య శ్రీ పథకం ఉన్నా రోగులను జాయిన్ చేసుకోకుండా.. డబ్బులు కడితేనే వైద్యం అందిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీనిపై విజిలెన్స్ దాడులూ జరుగుతున్నాయి. మరోవైపు వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒక్క సెకండ్ వేవ్‌లోనే 52 ఆసుపత్రులకు 3.6 కోట్లు జరిమానా విధించారు.
ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పటల్ తప్పనిసరిగా 50 శాతం బెడ్స్ ఆరోగ్య శ్రీ పథకం కింద కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. పలు హాస్పటల్స్ అదేశాలను ధిక్కరించినట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. దీన్ని సర్కారు సీరియస్‌గా తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. జరిమానాలు విధించినా.. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ దారికి రాకపోవడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతుంది.
ఇదీ చదవండీ... యువకుడి దారుణ హత్య.. ముక్కలుగా నరికి చంపాడు.. కుమార్తెను ప్రేమించాడనే..