రాష్ట్రవ్యాప్తంగా పట్ణణ మౌలికసదుపాయల కల్పన సంస్థ టిడ్కో ఆధ్వర్యంలో 94 పురపాలక సంఘాల్లో చేపట్టిన నివాస సముదాయాలు పూర్తయినా పేదల దరి చేరడం లేదు. పీఎంఏవై కింద కేంద్రమిచ్చిన నిధులకు మరిన్ని జతచేసి ఏకంగా గత ప్రభుత్వం రూ.10,600 కోట్ల రూపాయలతో భారీ భవన సముదాయాల నిర్మాణానికి పూనుకుంది. సాంకేతిక హంగులతో అత్యంత నాణ్యంగా నిర్మాణం చేపట్టిన గత ప్రభుత్వం... ఎన్నికల సమయం నాటికి 75వేల ఇళ్లను పూర్తిచేసింది. తుది దశలో ఇళ్లు మెరుగులు దిద్దుకుంటున్న సమయంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక పనులు నిలిపివేశారు. చాలా చోట్ల నిర్మాణ సామగ్రి ఆరు బయటే పడేయటంతో పాడైపోతున్నాయి. ఇనుము తుప్పుపట్టిపోతోంది. పీఎంపాలెం, అనకాపల్లి, చిన్నచౌకు, గూడూరు, రాజాం, పొన్నూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం గృహసముదాయాల్లో ముళ్లపొదలు పెరిగిపోతున్నాయి. అత్యంత సుందరంగా నిర్మించిన ఇళ్ల సముదాయాలు కళావిహీనంగా మారిపోతున్నాయి.
పేదలపై వడ్డీ భారం
గత ప్రభుత్వం ఇళ్ల లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసింది. తమ వాటా కింద కొందరు 300 చదరపు అడుగుల ఇంటికి 500 రూపాయల చొప్పున, 365 చదరపు అడుగులకు 50 వేల రూపాయల చొప్పున, 430 చదరపు అడుగులకు లక్ష రూపాయల చొప్పున చెల్లించారు. బ్యాంకులు కొందరికి రుణాలిచ్చాయి. నిర్మాణాల జాప్యంతో వడ్డీ భారం పెరిగిపోతోందని, ఇళ్లను ఎప్పుడిస్తారో చెప్పాలంటూ లబ్ధిదారులు అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు.
పగిలిన అద్ధాలు... తుక్కుగా ఇనుప చువ్వలు
నెల్లూరు నగర పరిధిలో, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో నిర్మిస్తున్న గృహసముదాయంలో కొన్ని ఇళ్ల కిటికీల అద్దాలు, తలుపులూ పగిలిపోయాయి. శ్రీకాకుళంలోని పాత్రునివలసలోనూ అదే పరిస్థితి. విజయనగరం జిల్లా సాలూరులో ఇళ్ల పునాదుల చుట్టూ నీరు చేరి మురుగుకాల్వలను తలపిస్తున్నాయి. సాలూరులోని చంద్రమ్మపేటలో 120 టన్నుల ఇనుపచువ్వలు తుక్కుగా మారేలా ఉన్నాయి. ఇచ్ఛాపురంలో పునాదుల కోసం అమర్చిన ఇనుప చువ్వలను వదిలేశారు. జంగారెడ్డిగూడంలో ఇళ్ల కిటికీలు, గుమ్మాలు తుప్పుబట్టాయి. ఒంగోలు, కదిరి, తాడిపత్రి, రాజాంలో నిర్మాణ సామగ్రికి తుప్పుపట్టింది. విశాఖ మధురవాడ మిథిలాపురి కాలనీ, నర్సీపట్నంలో నిర్మాణ సామగ్రిని ఆరుబయటే పడేశారు. గూడూరు పరిధిలో మరుగుదొడ్ల కమోడ్లను ఆరుబయట ఉంచేశారు. ఒంగోలు శివారులో నిర్మిస్తున్న గృహసముదాయంలో వర్షపు నీరు గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ నిలిచి ఉంది.
సామగ్రి చోరులపాలు
నెల్లూరులో 328 కోట్ల 58 లక్షల రూపాయలతో ఏకంగా 4800 ఫ్లాట్లతో కూడిన గృహ సముదాయం నిర్మించారు. దాన్ని అలాగే వదిలేయటంతో విద్యుత్తు తీగలు, కుళాయి పైపులు, సింకులు, మరుగుదొడ్లలోని సామగ్రి, ట్యూబులైట్లు, పార్కులోని పిల్లల ఆట వస్తువులు చోరీకి గురయ్యాయి. కృష్ణా జిల్లా తిరువూరులో 2 లక్షల విలువైన టైల్స్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. గుంటూరు జిల్లా పొన్నూరు, విజయవాడలోని జక్కంపూడిలోనూ టైల్స్ చోరీకి గురైనట్లు సిబ్బంది చెబుతున్నారు. తాడేపల్లిగూడెం, మధురవాడ మిథిలాపురి కాలనీలోని గృహ సముదాయాల్లోనూ కొంత నిర్మాణ సామగ్రి దొంగలపాలైనట్లు స్థానికులు తెలిపారు.
పనులు పూర్తయ్యేనా?
మొత్తం భవన సముదాయలను పూర్తి చేయడానికి మరో రూ.12 వేల కోట్ల వరకూ అవుతాయని అంచనా. ప్రభుత్వం ఇప్పట్లో అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే యోచనలో లేనట్లు కనిపిస్తోంది. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, ఆ జాబితాలను మరోసారి సరిచూడాలని ప్రకటించింది. తొలుత 25శాతం లోపు జరిగిన టిడ్కో భవనాల పనులను ప్రభుత్వం రద్దు చేసింది. 63, 744 గృహాలకు రివర్స్ టెండరింగ్ ద్వారా కొత్త గుత్తేదారులను ఎంపిక చేసింది. ఆయా సంస్థలు ఇంకా పనులు ప్రారంభించలేదు.