రాష్ట్రంలో 120 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపనే లక్ష్యంగా.... ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్టు కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 5లక్షల ఎకరాల భూమిని సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం వినియోగించనుంది. సౌర, పవన విద్యుత్తు రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కొత్త విధానం రూపొందించినట్టు ఇంధన శాఖ తెలిపింది.
ఈ విధానంలో భాగంగా సౌర పలకలు, పవన విద్యుత్తు టర్బైన్ల తయారీకీ ప్రోత్సాహం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రాజెక్టు డెవలపర్ల నుంచి ఏడాదికి ప్రభుత్వ భూమి ఎకరాకు 31 వేలు, ప్రైవేటు భూమికి 25 వేలు లీజు కింద వసూలు చేయనున్నారు. ప్రతీ రెండేళ్లకు లీజు మొత్తాన్ని 5శాతం చొప్పున పెంచనున్నట్లు ఇంధన శాఖ పేర్కొంది. గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఛార్జెస్ కింద మెగావాట్‌కు ఏడాదికి లక్ష వసూలు చేస్తారు. నోటిఫై చేసిన కాసేపటికే కొత్త విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం సవరణ ఆదేశాలు జారీ చేసింది.
దేశీయంగా సౌరవిద్యుత్తు పలకల దిగుమతిపై కేంద్రం విధించే కస్టమ్ డ్యూటీ భారాన్ని తగ్గించేందుకు ఈ సవరణ చేపట్టినట్టు ప్రభుత్వం తెలిపింది. దీర్ఘకాలంలో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా కొనుగోలు చేసే విద్యుత్తు ధర భారం పడకుండా ఆయా సంస్థలకు ఇచ్చే లీజు తగ్గించింది. ఈ మేరకు ఏడాదికి ఎకరాకు వసూలుచేసే లీజును 31వేల నుంచి 5రూపాయలకు కుదించింది. రైతులకు 9గంటల ఉచిత విద్యుత్తు అందించటమే లక్ష్యంగా 10వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. 10వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టును నిర్మించేందుకు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: