రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన సర్కారు ఉద్యోగాల భర్తీలో వ్యవహరించాల్సిన విధానాలపై స్పష్టత ఇచ్చింది. ఈ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వెబ్‌సైట్‌ను ప్రారంభం
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయంలో సహా జిల్లాలోని కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీలో మధ్యవర్తులను పూర్తిగా తొలగించడం సహా జీతం ఇచ్చేటప్పుడు... పీఎఫ్, ఈఎస్ఐ వంటి వాటిలో ఎలాంటి మోసాలు లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. లంచాలు, మోసాలకు తావు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమన్నారు. నెలవారీ జీతం రూ.30 వేల లోపు ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 15 కల్లా ఉద్యోగాల జాబితాలు కమిటీ, శాఖాధిపతుల నుంచి రావాలని జనవరి 1 నుంచి నియామక పత్రాలు జారీ చేయాలని స్పష్టం చేశారు.
ఇంఛార్జీ మంత్రిదే అధికారి
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జిల్లా స్థాయిలో ఇంఛార్జీ మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉంటారని.. జిల్లా కమిటీకి నేతృత్వం వహిస్తారని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో నియామకాలకు సంబంధిత శాఖ మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉండగా.. సంబంధిత శాఖ కార్యదర్శి కమిటీకి కన్వీనర్‌గా ఉంటారని అన్నారు. డిసెంబర్ 15 లోగా ప్రక్రియ పూర్తి చేసి జనవరి 1 నుంచి ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులకు నిర్దేశించారు.
ఇదీ చదవండి:
''నేను చేసుకున్న పెళ్లిళ్లతోనే జగన్ రెండేళ్లు జైలుకెళ్లారా..?''