కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన రాష్ట్ర అధికారులు.. ఖాతాలు తెరిచే కార్యక్రమానికి పచ్చజెండా ఊపారు. తొలుత సింగిల్ నోడల్ ఖాతాలు తెరిచి, ఆనక ఓవర్ డ్రాఫ్ట్, ఆ నిధుల ఆధారంగా రుణాల సంగతి చూద్దామని నిర్ణయించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల విధివిధానాలు మార్చడంతో నిధుల సమీకరణకు రాష్ట్రం ఆపసోపాలు పడుతోంది. తాజా నిబంధనల మేరకు కేంద్ర నిధులను పీడీ ఖాతాలకు మళ్లించకూడదు. కేంద్రం నిధులు ఇచ్చిన 21 రోజుల్లోపు రాష్ట్రం తన వాటా నిధులు జమ చేయాలి. ఇందుకు సింగిల్ నోడల్ ఏజెన్సీ ఏర్పాటుచేయాలి. ప్రతి పథకానికీ ఏకైక నోడల్ ఖాతా ప్రారంభించాలి. అవన్నీ పూర్తిచేసి సెప్టెంబరు 30 లోపు తమకు సమాచారం అందిస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం షరతు పెట్టింది. దీంతో ముందు ఖాతాలు తెరిచేందుకు ఏర్పాట్లుచేశారు. ప్రభుత్వ లీడ్‌బ్యాంకుగా ఉండే ఆంధ్రాబ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంకులో విలీనమైంది. దాంతో యూనియన్ బ్యాంకు విజయవాడ శాఖలో ఖాతాలు తెరవాలంటూ అన్ని ప్రభుత్వశాఖలనూ ఆదేశించింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి...
- ప్రతి ప్రభుత్వ విభాగం ఏకైక నోడల్ ఏజెన్సీని ఏర్పాటుచేయాలి. ఆ ఏజెన్సీల ద్వారా ఏకైక నోడల్ ఖాతాలు తెరవాలి. ప్రతి కేంద్ర ప్రాయోజిత పథకానికి ఒక ఖాతా, ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి.
- రెండు పథకాలకు కలిపి ఒకే ఖాతా ఉండకూడదు.
- తర్వాత ప్రతి ప్రభుత్వశాఖ ఏకైక నోడల్ ఏజెన్సీని గుర్తించాలి. వారు సున్నా నిల్వతో సబ్సిడరీ ఖాతాలు తెరవాలి.
- విజయవాడ యూనియన్ బ్యాంకు శాఖలో అన్ని ప్రభుత్వ విభాగాలు ఇలా ఖాతాలు తక్షణం తెరవాలి. ఆ ఖాతాల వివరాలు కేంద్రప్రభుత్వంలో ఆయా పథకాలను అమలు చేసే మంత్రిత్వశాఖలకు తెలియజేయాలి.
రాష్ట్ర వాటా నిధులు ఎలా?
ఇంతకాలం కేంద్రం నిధులు వచ్చినా, పీడీ ఖాతాలకు మళ్లించి రాష్ట్రప్రభుత్వ అవసరాలకు తగ్గట్టు వినియోగించేవారు. ఇప్పుడు కేంద్రవాటా నిధులకు తక్షణమే రాష్ట్రవాటా నిధులు తక్షణమే జతచేయాలి. అసలే ఆర్థిక సమస్యలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అదనపు భారంగా ఉంది. ఇంతకాలం కేంద్రనిధులు వినియోగించుకున్న తీరూ మారడంతో ఆ రూపంలోను భారం ఏర్పడబోతోంది. అందుకే రూ.6,500 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కావాలని ఎస్‌బీఐని కోరితే కాదు పొమ్మంది. ఈ నేపథ్యంలో తొలుత యూనియన్ బ్యాంకులో ఖాతాలు తెరిస్తే ఆనక వారి నుంచే ఓడీ సౌకర్యం లేదా, రుణాలు పొందాలనే అంతర్గత ఆలోచన మేరకు ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు తెలిసింది. ముందు ఖాతాలు తెరిస్తే ఆనక ఆ సంగతి చూద్దామనే భరోసా వచ్చినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: