అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టులో విచారణ జరిగింది. డీజీపీ గౌతం సవాంగ్ ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. వాహనాల విడదలలో అధికారులు నిబంధనలు పాటించట్లేదని పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని న్యాయస్థానం స్వయంగా డీజీపీ రావాలని మంగళవారం ఆదేశించింది.
హైకోర్టులో వ్యాజ్యాలు...
మద్యం అక్రమ రవాణా చేస్తూ జప్తునకు గురైన వాహనాలను సంబంధిత మెజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ముందు ఎందుకు ఉంచడం లేదన్న విషయంపై.. డీజీపీ వివరణ ఇవ్వాలని హైకోర్టు మంగళవారం తెలిపింది. ఈ మేరకు డీజీపీ తమ ముందు ఈరోజు హాజరుకావాలని న్యాయమూర్తి జస్టిస్ జట్టు దేవానంద్ ఆదేశాలు జారీచేశారు. నిబంధనలకు లోబడి మద్యం తీసుకెళ్తున్నప్పటికీ పోలీసులు తమ వాహనాల్ని జప్తు చేశారని, వాటిని విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
ఇదీ చదవండి:
పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత: గుంటూరు జిల్లాలో తెదేపా నేతపై దాడి