ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో సామాజిక మాధ్యమ పరిశీలన (సోషల్ మీడియా వాచ్) విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా ఒక వాట్సప్ గ్రూపులో అభ్యంతరకర అంశాలు పోస్టు చేసిన వారిపైనే చర్యలు తీసుకోవాలా? గ్రూపులో సభ్యులందర్నీ బాధ్యుల్ని చేయాలా? అనే అంశంపై ఆలోచన చేస్తున్నామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
167 కేసుల్లో వారంలో దర్యాప్తు పూర్తి
* దిశ ఆవిష్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 167 కేసుల్లో వారంలోనే దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు సమర్పించాం. వీటిలో 33 అత్యాచారాల కేసులు కాగా, 134 లైంగిక నేరాల కేసులు. 20 కేసుల్లో శిక్షలు పడేలా చేయగలిగాం. 2017లో 49.3 శాతంగా ఉన్న శిక్షల శాతాన్ని ఈ ఏడాది 64 శాతానికి పెంచాం.
* 89 రకాల పోలీసు సేవల్ని ఆన్‌లైన్‌లో అందించేందుకు వీలుగా త్వరలో ‘సురక్ష స్పందన యాప్’ తీసుకొస్తాం. స్టేషన్‌కు రాకుండానే వివిధ రకాల ధ్రువపత్రాలు పొందొచ్చు.
ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే...
సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి ఫిర్యాదులోని అంశాలు, వాటి వాస్తవికత ఆధారంగానే చట్టప్రకారం మా చర్యలు ఉంటాయి. కొంతమంది పోస్టుల్లో నేరుగా కాకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. మరి కొంతమంది పోస్టుల్లో అక్షరాలకు వేర్వేరు అర్థాలు ఉంటున్నాయి. ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని నేరాంశం ఉంటే... కేసు నమోదు చేస్తున్నాం.
చట్టానికి ఎవరూ అతీతం కాదు
‘రాజధాని మహిళలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు లేవు. అదే ఎల్జీ పాలిమర్స్ ఘటనపై పోస్టు చేశారంటూ వృద్ధురాలిపై చర్యలు తీసుకున్నారు? ఎందుకీ తేడా?’ అని విలేకరులు ప్రశ్నించగా... ఇలాంటి అభిప్రాయాలు ఉన్నవారు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారని అవన్నీ హైకోర్టులో ఉన్నాయని, తప్పు చేసిన వారి వయసు ఎక్కువనే కారణంతో చట్టం నుంచి రక్షణేమీ ఉండదని, చట్టానికి ఎవరూ అతీతం కాదని గౌతమ్ సవాంగ్ అన్నారు.
ఇదీ చదవండి
చేతులు కట్టుకు కూర్చోలేం.. రూ.50 కోట్లు తాత్కాలిక పరిహారమే:ఎన్జీటీ