ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అత్యవసర భేటీ అయ్యారు. సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల విధులపై ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ చర్చించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులను బలవంతంగా ఎన్నికల విధులకు పంపొద్దని సీఎస్‌ని కోరామని వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికలను ప్రభుత్వం వాయిదా కోరింది.. కాబట్టే తాము కూడా కోరామని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగులను అవసరానికి తగ్గట్టుగా వాడుకున్నాయని ఆరోపించారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు ఎన్నికల విధులు కేటాయించవద్దని చెప్పామని.. విధుల్లో మృతి చెందితే పరిహారం చెల్లించాలని కోరామని చెప్పారు. ఎన్నికల విధులకు పూర్తిగా సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఎస్ఈసీ బాధ్యత తీసుకోవాలి: చంద్రశేఖర్ రెడ్డి
వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు వాయిదా వేయాలన్నా పట్టించుకోలేదు. ఏపీ ఎన్జీవోలు ఎన్నికలకు సిద్ధంగా లేరు. అవసరం అయితే బాయ్‌కాట్ చేయాలని ఉద్యోగులు కోరారు. అయితే సీఎస్ దీనిపై పిలిపించి మాట్లాడారు. త్వరగా వ్యాక్సినేషన్ వేయిస్తామని చెప్పారు. ఎన్నికల విధుల్లో చనిపోతే రూ.50 లక్షల పరిహారం కోరాం. పంచాయతీ ఎన్నికలకు సహకరించాలని సీఎస్ కోరారు. సీఎస్ హామీ తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు అంగీకరిస్తున్నాం. ఎన్నికల విధులు నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు పిలుపు ఇస్తున్నాం. ఉద్యోగులు ఎవరైనా చనిపోతే బాధ్యత ఎస్‌ఈసీనే తీసుకోవాలి -చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎన్జీవో సంఘ నేత
స్థానిక ఎన్నికలకు వ్యతిరేకం కాదు: వెంకటేశ్వర్లు
పంచాయతీ ఎన్నికలపై సీఎస్ ఉద్యోగ సంఘాలను పిలిపించి మాట్లాడారని ఏపీ ఐకాస నేత బొప్పపరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం పంచాయతీ ఎన్నికల మొదటి దశను రీషెడ్యూల్ చేశారో అలాగే రెండో దశను కూడా రీ షెడ్యూల్ చేస్తే బాగుంటుందని చెప్పామన్నారు. వ్యాక్సిన్ వేసి, పీపీఈ కిట్లు ఇస్తే విధులు నిర్వహిస్తామని చెప్పారు. ఎస్‌ఈసీ అపాయింట్‌మెంట్ ఇస్తే సమస్యలు విన్నవిస్తామని పేర్కొన్నారు. ఏపీ ఐకాస స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
ఆ ఇద్దరూ విధి నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారు: ఎస్ఈసీ