రాష్ట్రంలో నిత్యావసరాల కోసం మార్కెట్ల వద్ద జనం గుమిగూడటంపై ముఖ్యమంత్రి జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన ఆయన.. ఈ పరిస్థితిని మార్చేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. నగరాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ చేయాలని సీఎం సూచించారు. ఈ 21 రోజుల పాటూ కూరగాయలు, నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని... అధికారులకు స్పష్టం చేశారు. పరిమిత వేళలే అయినా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ నిత్యావసరాలను కొనుగోలు చేసుకునేలా అనుమతించాలని నిర్ణయించారు. అది కూడా ఇంటికి ఒక్కరు చొప్పున బయటకు రావాలని.. 2 - 3 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు అనుమతించకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లను... కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే.. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిల్వ చేయలేని పంట ఉత్పత్తులపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని... రైతులకు నష్టం లేకుండా చూడాలని సూచించారు.
రోజంతా 144 సెక్షన్
ఇదేసమయంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే..కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సీఎం ఆదేశించారు. రోజంతా 144 సెక్షన్ అమల్లో ఉంచాలని, నలుగురికి మించి ఎక్కడా గుమిగూడే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే... 1902 కాల్ సెంటర్‌కు సంప్రదించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: