పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని.. ప్రపంచ పర్యాటక రంగంలో ఏపీకి తగని స్థానం ఉండాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు. ఏపీ టూరిజం ఆన్లైన్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించిన ఆయన.. పర్యాటక శాఖపై అధికారులతో సమీక్షించారు. ఏపీ టూరిజం నూతన పాలసీ రూపకల్పనపై చర్చించారు. పెట్టుబడులకు ముందుకొచ్చేవారికి అనువుగా పాలసీ ఉండాలన్న జగన్.. అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులను అధికారులకు సూచించారు.
ఆతిథ్య రంగంలో సుప్రసిద్ధ కంపెనీల భాగస్వామ్యం తీసుకోవాలని ఆదేశించారు. రాజస్థాన్‌తో దీటుగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్రంలో 12 నుంచి 14 ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్.. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో మంచి కళాశాల పెట్టాలని సూచించారు. ఈ కళాశాల నుంచి బయటకు వస్తే కొలువు తప్పనిసరిగా వస్తుందనే నమ్మకం ఉండేలా చూడాలని అన్నారు. ఏపీటీడీసీ ప్రాపర్టీస్, లోన్స్ విషయంలో నిధులు ఎక్కడా దుర్వినియోగం కావద్దని సూచించారు.
నిబంధనలకు అనుగుణంగా
పర్యాటక ప్రదేశాలను కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ తెరుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 12 ప్రాంతాల్లో 7 స్టార్ హోటళ్లు... అంతర్జాతీయ స్థాయి హోటళ్లు వస్తాయని రాష్ట్ర పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
కరోనా వల్ల హోటళ్లు, రిసార్ట్స్ చాలా నష్టాలు చవి చూశాయని.. రాయితీల కోసం హోటళ్ల యాజమాన్యాలు ఇచ్చిన వినతులపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి అవంతి వెల్లడించారు. విజయవాడ బాపు మ్యూజియాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్న ఆయన.. శిల్పారామాలను సైతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి..