Ap CM Jagan: రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనకు ఇప్పుడు జరుగుతున్నంత ప్రయత్నం గతంలో ఎప్పుడూ లేదని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఎస్‌డీజీ సాధన దిశగా కృషి చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని తెలియజెప్పడం అంతే అవసరమని పేర్కొన్నారు. అమ్మ ఒడి, పాఠశాలల నిర్వహణ నిధి (ఎస్‌ఎంఎఫ్), మరుగుదొడ్ల నిర్వహణ నిధితో (టీఎంఎఫ్) పాటు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాల గురించి సక్రమంగా రిపోర్టింగ్ చేయలేదని తెలిపారు.
‘రిపోర్టింగ్ సక్రమంగా లేనప్పుడు మనం ఎంత పని చేసినా లాభం లేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో పోటీ పడటం ద్వారా దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు మనకు అవకాశం వచ్చింది. గతంలో ఈ పరిస్థితి లేదు. మనం అమలు చేస్తున్నన్ని పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. ముందే క్యాలెండర్ ప్రకటించి డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బులు వేస్తున్నాం. అవినీతి, వివక్షకు తావులేకుండా అర్హులందరికీ పథకాలను అమలు చేస్తున్నాం. ఎస్‌జీడీ రిపోర్టును ప్రతి నెలా కలెక్టర్లు పర్యవేక్షించాలి. దానిపై విభాగాధిపతుల పర్యవేక్షణ అవసరం. సచివాలయం నుంచి సమాచారం జిల్లా స్థాయికి చేరాలి’ అని సీఎం పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా జరుగుతున్న కృషిపై ఆయన గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ‘వైద్య, ఆరోగ్య, విద్య, వ్యవసాయ రంగాల్లో మనం తీసుకొచ్చినన్ని విప్లవాత్మక మార్పులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ లేవు. ఎంఎస్‌ఎంఈ రంగంలో మనం చేస్తున్న కృషి మరే రాష్ట్రంలోనూ లేదు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రామాణిక నిర్వహణ విధానాల్ని (ఎస్‌ఓపీ) రూపొందించుకుని కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ‘విద్యా కానుక, విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ అమలు, 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, నాడు-నేడుతో ఆసుపత్రుల పునర్వ్యవస్థీకరణ, ఆరోగ్య ఆసరా వంటి పథకాలేవీ గతంలో లేవు. మహిళా సాధికారతలో భాగంగా చేయూత, ఆసరా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, మహిళల పేరు మీదే పట్టాల రిజిస్ట్రేషన్ గతంలో జరగలేదు.
లబ్ధిదారుల ఖాతాలో రూ.1.65 లక్షల కోట్లు జమచేశాం. ఎస్‌డీజీ నివేదికలో అవన్నీ ప్రతిఫలించాలి’ అని సీఎం పేర్కొన్నారు. ‘ఎన్ని రోజులకు ఒకసారి సమావేశం అవ్వాలన్న దానిపై నిర్దిష్ట సమాచారం ఉండాలి. గత సంవత్సరం అది లోపించింది. ఈసారి అలా జరగడానికి వీల్లేదు. ప్రతి నెలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రెండు సార్లు సమావేశమవ్వాలి. వాటికి ఆయా శాఖల కార్యదర్శులంతా హాజరవ్వాలి’ అని సీఎం స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో ఐటీ హబ్
విశాఖపట్నంలో అత్యాధునిక వసతులతో ఐటీ హబ్ నిర్మించాలని సీఎం తెలిపారు. దానిపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ కె.వి.రాజేంద్రనాథరెడ్డి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రజలను బురదలో వదిలేసి.. సీఎం గాల్లో తిరుగుతున్నారు: చంద్రబాబు