సీబీఐ కేసుల తరువాత ఈడీ కేసుల విచారణ చేపట్టాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ/ఈడీ కోర్టు జనవరి 11న కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీన్ని హైకోర్టులో సవాలు చేయనున్నామని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి సీబీఐ కోర్టుకు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, అవినీతి నిరోధక చట్టాలు వేర్వేరని, అందువల్ల సీబీఐ కేసుతో సంబంధం లేకుండా ఈడీ కేసుపై విచారణ చేపట్టవచ్చని సీబీఐ కోర్టు తీర్పుఇచ్చిన విషయం విదితమే.
అంతేగాకుండా రెండు కేసులనూ ఒకేసారి విచారణ చేపట్టాలన్న జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరుల అభ్యర్థనలనూ తోసిపుచ్చింది. సీబీఐ కేసు తేలేదాకా ఈడీ కేసు విచారణ నిలపాల్సిన అవసరం లేదంటూ ఈడీ సమర్పించిన పలు తీర్పుల నేపథ్యంలో నిందితుల పిటిషన్‌లను కొట్టివేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మంగళవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూధన్‌రావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఈడీ కేసును ప్రత్యేకంగా విచారించవచ్చంటూ ఈ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బుధవారం హైకోర్టులో అప్పీలు దాఖలు చేయనున్నామని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది చెప్పడంతో తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేశారు.
బి.పి.ఆచార్యకే పరిమితం
అరబిందో, హెటిరో సంస్థలకు భూకేటాయింపుల వ్యవహారంపై ఈడీ నమోదు చేసిన కేసులో తన తరఫున సహ నిందితుడు హాజరుకావడానికి అనుమతించాలంటూ ప్రధాన నిందితుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయడానికి ఈడీ గడువు కోరడంతో తదుపరి విచారణ వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడైన ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్య ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి లేదన్న కారణంగా కేసును కొట్టివేస్తూ ఈడీ ఫిర్యాదును వెనక్కి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయం విదితమే. దీనిపై హైకోర్టు నుంచి సీబీఐ కోర్టు స్పష్టత తీసుకుంది. హైకోర్టు ఉత్తర్వు కేవలం ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్యకు మాత్రమే వర్తిస్తుందని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో బి.పి.ఆచార్య మినహా మిగిలిన వారిపై కేసు విచారణ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేస్తూ అభియోగాల నమోదు నిమిత్తం విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. రఘురాం/భారతి సిమెంట్స్‌కు లీజుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసుపై విచారణను ఈనెల 5వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: కర్రలు, రాడ్లతో తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు