రాష్ట్రంలో 133 రెడ్‌జోన్లు.. రాకపోకలు నిషేధం - ఏపీ రెడ్‌జోన్స్ వార్తలు
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 133 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. పాజిటివ్ కేసులు నమోదైన ఈ ప్రాంతాలను... కంటైన్మెంట్ క్లస్టర్లుగా విభజించి వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. పాజిటివ్ బాధితుల సంబంధీకులపై నిరంతర నిఘాతోపాటు ఐసోలేషన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.
కరోనా వ్యాప్తి నిరోధించేందుకు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 133 ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణతోపాటు వైరస్ వ్యాప్తిచెందకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 30 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో 26 డివిజన్లను రెడ్ జోన్లుగా గుర్తించారు. ఇక్కడ రాకపోకలకు అడ్డుకట్టవేశారు. కర్నూలు జిల్లాలో 22 రెడ్‌జోన్లు ఏర్పాటుచేశారు. రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
కృష్ణా, గుంటూరు పరిధిలో
కృష్ణాజిల్లాలో 16, గుంటూరు జిల్లాలో 12 ప్రాంతాల్ని రెడ్‌జోన్ పరిధిగా గుర్తించి ఆంక్షలు కఠినం చేశారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం తురకపాలెం గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. గ్రామంలోకి ఎవరు రాకుండా భారీ గేట్లు ఏర్పాటుచేశారు. నరసరావుపేటలోని రెడ్‌జోన్ ప్రాంతాల్ని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు పరిశీలించారు. పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు.
గోదావరి జిల్లాల్లో
పశ్చిమగోదావరి జిల్లాలోనూ 12 ప్రాంతాల్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో 11 , తూర్పు గోదావరి జిల్లాలో 8 ప్రాంతాలను రెడ్‌జోన్ల పరిధిలోకి తెచ్చారు. కత్తిపూడి గ్రామాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. కరోనా వచ్చిన ఉపాధ్యాయుడికి చికిత్స అందించిన స్థానిక ఆసుపత్రి, ల్యాబ్‌ను సీజ్ చేశారు.
విశాఖ, రాయలసీమ జిల్లాల్లో
చిత్తూరు జిల్లాలో పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న తిరుపతితో పాటు మరో 6 ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించారు. విశాఖ, కడప జిల్లాల్లో 6 చొప్పున రెడ్‌జోన్లు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో 3 ప్రాంతాలను ప్రభుత్వం రెడ్ జోన్లుగా ప్రకటించింది. ఈ ప్రాంతాలను కంటైన్మెంటు క్లస్టర్లుగా విభజించి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇక రాష్ట్ర, జిల్లా రహదారుల్లోని ప్రవేశ మార్గాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని.. ప్రతీ ఒక్కరినీ పరీక్షించిన అనంతరమే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి : ఎన్నికల వాయిదా నుంచి తొలగింపు వరకు... కారణాలెన్నో!