పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ, పునరావాసానికి సంబంధించిన అంశాలతో తాజా నివేదికను రాష్ట్ర జలవనరులశాఖ..... కేంద్ర కమిటీకి సమర్పించింది. పోలవరం ప్రాజెక్టులో 55,548 కోట్లతో రెండో డీపీఆర్ ఆమోద ప్రక్రియలో భాగంగా.... కేంద్రం ఏర్పాటు చేసిన అంచనాల సవరణ కమిటీ పంపిన నమూనా ఆధారంగా వివరాలు అందించారు. కేంద్ర జల్‌శక్తికి చెందిన సాంకేతిక సలహా కమిటీ ఇప్పటికే డీపీఆర్‌కు ఆమోదం తెలిపింది. కేంద్రం 100 శాతం నిధులు ఇచ్చేందుకు హామీ ఉన్న నేపథ్యంలో తాజాగా.. అంచనాల సవరణ కమిటీ ఆర్సీసీ .. ఈ డీపీఆర్‌ను ఆమోదించాలి.
నివేదిక అందజేత..
రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ దిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి జగ్‌మోహన్‌గుప్తాకు నివేదిక అందించారు. కేంద్రం జలవనరుల శాఖ మంత్రిని కలిసి.. నిధుల విడుదలపైనా చర్చించారు. రెండో డీపీఆర్ పై వారంలో భేటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వర్గీకరణ చేయాలని సూచన!
పోలవరంలో ముంపునకు గురయ్యే భూమి... ప్రధాన డ్యాం నిర్మాణానికి, కాలువల తవ్వకానికి వినియోగించే భూమి, పునరావాసం కోసం కేటాయించిన భూమి వివరాలను కమిటీ కోరింది. ఇందులో పట్టాభూమి, డీ పట్టాభూమి, ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమి, అటవీభూమి, ఇతర భూమి అని వర్గీకరణ చేయాలని కమిటీ సూచించింది. 2010-11లో డీపీఆర్ ఆమోదించినప్పటికీ.... 2017-18 నాటికి క్షేత్రస్థాయి సర్వేకు లెక్కలు మారాయి. దీంతో 2017-18 నాటి పరిమాణాలను 2013-14 ధరలతో లెక్కిస్తే అయ్యే వ్యయం ఎంత అనే వివరాలను కమిటీ తెలుసుకుంది. నిర్వాసితులకు సంబంధించిన అంశాలను కూడా ఇదే కోణంలో సమర్పించాలని సూచించింది. ఇంతవరకూ ఏ వర్గీకరణలో ఎంత ఖర్చు చేశారన్న వివరాలనూ కమిటీ కోరింది.
ఖర్చుపై ఆడిట్ నివేదికను కోరిన కేంద్రం
2014 ఏప్రిల్ 1కి ముందు పోలవరంపై చేసిన ఖర్చుకు ఆడిట్ నివేదికను కేంద్రం కోరింది. అది పంపితే తప్ప తదుపరి నిధులు విడుదల చేయబోమని పేర్కొంది. విడివిడిగా ఆడిట్ లెక్కలు సమర్పించినా... కేంద్రం.. ఆ మొత్తానికి ఆడిట్ నివేదిక అవసరమని స్పష్టం చేసింది. ఇందులో 311 కోట్ల 66 లక్షల రూపాయలకు సంబంధించిన బిల్లులు తెలంగాణలో ఉండిపోవటంతో ఆడిట్‌కు ఇబ్బందిగా మారిందని పేర్కొంటున్నారు.
రికార్డులన్నీ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కార్యాలయంలో ఉండిపోవటం, ఆ మండలాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కలవటంతో ఇప్పుడు రికార్డు సేకరణ సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : 'రైల్వే అప్రెంటిస్ పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయాలి'