మార్కెట్లో మరో కొత్త బాబా(Fake baba in Hyderabad) బాగోతం బయటపడింది. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. వాళ్ల నమ్మకాన్ని సొమ్ము చేసుకునే స్వామీజీలు కొందరైతే.. భక్తి ముసుగులో రక్తి సాగిస్తున్న బాబాలు మరికొందరు. ఇన్నాళ్లు దేవుని పేరు చెప్పుకుని కామక్రీడలాడిన బాబాల బాగోతాలు బయటపడితే.. ఇప్పుడు భూతాల పేరుతో కామవాంఛ తీర్చుకుంటున్న ఫకీరు మహిమలు వెలుగుచూశాయి. అనారోగ్యంతో వచ్చిన మహిళలకు దయ్యం పట్టిందని నమ్మించి.. దాన్ని వదిలిస్తానంటూ లొంగదీసుకుంటున్న భూతవైద్యుని ఘనకార్యాలు "న భూతో న భవిష్యత్".
బాణామతి పేరుతో సొమ్ము చేసుకుని..
హైదరాబాద్ పాతబస్తీ కిషన్‌బాగ్‌కు చెందిన ఓ మహిళ తల్లి అనారోగ్యానికి గురైంది. బంధువుల సూచన మేరకు 2005లో చంద్రాయణగుట్టలోని భూత వైద్యుడు సయ్యద్ హసన్ అక్సారిని ఆశ్రయించింది. అనూహ్యంగా.. తల్లి ఆరోగ్యం కుదుటపడింది. భూత వైద్యుని కారణంగానే తల్లి కోలుకుందని ఆ మహిళ నమ్మింది. అనంతరం తన కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా.. భర్తతో విడాకులు తీసుకుని ఆ మహిళ వేరుగా ఉంటుంది. ఇక మన ఫకీర్ కన్ను ఆ మహిళపై పడింది. ఆమెను లోబర్చుకునేందుకు తన మహిమలన్ని బయటకు తీశాడు. "విడాకులు ఇచ్చిన భర్త నీ శరీరంపై మంత్రాలు, బాణామతి చేశాడు" అని నమ్మించాడు. తన ఇల్లును అమ్మేపించి.. వచ్చిన డబ్బులను కాజేశాడు. ఆ తర్వాత బాధితురాలు సమీపంలోని బండ్లగూడకు తన మకాం మార్చింది. ఆరోగ్యం బాగుండడంలేదని మళ్లీ ఫకీర్‌ను కలిసింది.
మంత్రాల పేరుతో ఐదేళ్లుగా..
ఇంకేముంది.. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టైంది మన ఫకీర్ పని. బాణామతి బూచి ఉండనే ఉంది. దాన్ని చూపిన ఫకీర్.. ఆమెను నమ్మించి లొంగదీసుకున్నాడు. 2016 నుంచి ఇదే సాకుతో ఆమెను అనుభవిస్తూనే ఉన్నాడు. అంతటితో ఆగాడా అంటే.. బాధితురాలి వెంట వచ్చిన సోదరిపైన కూడా కన్నేశాడు. మంత్రాల పేరుతో ఆమెను కూడా భయపెట్టి లొంగదీసుకున్నాడు. "బాప్ ఏక్ నంబర్ బేటా దస్ నంబర్" అన్నట్టు.. ఆ భూత వైద్యుని కుమారుడు సయ్యద్ అఫ్రోజ్ కూడా బాధితురాలిపై లైంగికదాడులకు పాల్పడ్డాడు. ఈ ఫేక్ బాబాల బాగోతం చాలా ఆలస్యంగా తెలుసుకున్న మహిళా బాధితులు.. బయటికి చెప్పేందుకు ఇన్ని రోజులు భయపడ్డారు. ఇక వాళ్ల వేధింపులు భరించలేక.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేక్ ఫకీర్లైన తండ్రీకొడుకులిద్దరిని అరెస్టు చేశారు. వీరి నుంచి తాయత్తులు, జీడిగింజలు, సాంబ్రాణి పొడిని స్వాధీనం చేసుకున్నారు.
గుడ్డిగా మాయలో పడిపోతే ఎలా..
ఇలాంటి ఎన్ని ఘటనలు బయటకొస్తున్నా.. అమాయక జనాలు ఇంకా వాళ్లనే నమ్ముతున్నారు. వాళ్లు చెప్పినవన్నీ గుడ్డిగా చేస్తూ.. వాళ్ల మాయలో పడిపోతున్నారు. తీరా వాళ్ల వికృత చేష్టలకు బలయ్యాక.. బోరుమంటున్నారు. అలాంటి ఫేక్‌గాళ్ల చీకటి బాగోతాలు బయటికి చెప్పకుండా.. బజార్లో పడతామని కడుపులోనే దాచుకుంటున్నారు. మరి కొందరు ధైర్యంగా ముందుకొచ్చి ఇంకెవరూ బలవ్వకుండా బజార్లోకి ఈడుస్తున్నారు. అలా బయట పడిందే.. ఈ పాతబస్తీ ఫేక్ ఫకీర్ ఘటన కూడా. "మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్లు కూడా ఉంటారు" అన్న నానుడిని దృష్టిలో పెట్టుకోనైనా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారు సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి వైద్యులకు చూపించుకోవాలి కాగా.. ఇలా మూఢనమ్మకాలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. మంత్రాల పేరుతో మోసం చేసే వారి వివరాలను స్థానిక పోలీసులకు చెప్పాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:
Father rapes Daughter in Vikarabad : కుమార్తెను గర్భవతి చేసిన తండ్రి