పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమైంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 48 గంటల్లోనూ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
వర్షపాతం
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో 11.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. పెదపాడులోనూ 10.2 సెంటిమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణశాఖ తెలియచేసింది. భీమవరంలో 8.4, కృష్ణా జిల్లా పెడనలో 5.1, ప్రకాశం జిల్లా కంభంలో 4.8 సెంటిమీటర్లు, గుంటూరు జిల్లా గురజాలలో 4.8, కడపలో 4.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు సెంటిమీటర్లకు పైగా వర్షపాతం 651 చోట్ల నమోదు అయినట్టు వాతవరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి : ఏపీలోని వాయు కాలుష్య నగారాలివే.. చెప్పిన కేంద్రం