ఈ ఏడులాగే గతేడాది కూడా ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియను హైకోర్టు రద్దు చేయడంతో ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించారు. ఈసారి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఆగస్టు 13న ఆన్‌లైన్ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతకు 27 వరకు అవకాశం కల్పించారు. తొలి విడత సీట్లను కేటాయించకుండానే రెండో విడతకు ప్రకటన విడుదల చేశారు. మంగళవారంతో రెండో విడత గడువూ ముగుస్తోంది.
రాష్ట్రంలో ఏటా 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరతారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2.60 లక్షల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. మరో 2.50 లక్షల మంది వరకు విద్యార్థులు ఆన్‌లైన్ ప్రకటనకు ముందే ప్రైవేటు కళాశాలల్లో చేరారు. వీరికి ఆయా విద్యాసంస్థలు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ‘ఆన్‌లైన్ ప్రవేశాల’ గందరగోళంతో ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ఇంకా ప్రారంభం కాలేదు
. ఇంటర్ విద్యామండలి ఈ నెల ఒకటి నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు తొలుత షెడ్యూల్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ప్రవేశాలు పూర్తికాకపోవడంతో దీన్ని వాయిదా వేసింది. మరోవైపు గతేడాది ఆన్‌లైన్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో ఇంటర్ విద్యామండలి విద్యార్థుల నుంచి రూ.2 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆన్‌లైన్ ప్రవేశాలు రద్దయినా ఆ మొత్తాన్ని విద్యార్థులకు తిరిగివ్వలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చూడండి: EAPCET RESULTS: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు రేపు