AP High Court on Pending Bills: బిల్లుల సొమ్ము చెల్లింపులో సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ వద్ద జాప్యంపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. నిధుల కొరత, కొవిడ్ తదితర కారణాలున్నాయని వెల్లడించారు. పిటిషనరుకు ఈనెల 5న సొమ్ము జమ చేశామని తెలిపారు. ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. వ్యాజ్యంపై విచారణను మూసివేశారు.
ప్రకాశం జిల్లా మండలంలో చేపట్టిన ఓ రహదారి పనులకు రూ .62.94 లక్షలు చెల్లించాలంటూ బిల్లులు సమర్పించినా సొమ్ము జమ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో గుత్తేదారు సీహెచ్ శ్రీనివాసరెడ్డి వ్యాజ్యం చేశారు. బిల్లులు ఆమోదం తెలిసినా సీఎఫ్ఎంఎస్ విధానం వద్ద పెడింగ్‌లో ఉండటంతో దానికి ఛైర్మన్ అయిన ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి గతంలో ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ రావత్ కోర్టుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ చాలా వ్యాజ్యాల్లో కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదని.. ధిక్కరణ వ్యాజ్యాలు వేశాకే సొమ్ము చెల్లిస్తున్నారని ఆక్షేపించారు. బిల్లులను ఏళ్ల తరబడి పెండింగ్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే హాజరుకావాలని ఆదేశిస్తామని తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి:
సినిమా టికెట్ల ధరల వివాదం.. జగన్, చిరంజీవి భేటీ వ్యక్తిగతం: మంచు విష్ణు