అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ ప్రతిపాదనలో మార్పు జరిగింది. గుంటూరు సమీపంలోని పేరేచర్ల దగ్గర రింగ్‌రోడ్‌లో ఈ మార్గం కలవాల్సి ఉండగా.... ఇప్పుడు చిలకలూరిపేట బైపాస్‌లో కలపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ మార్గం అనంత- అమరావతికి బదులుగా అనంత-చిలకలూరిపేట ఎక్స్‌ప్రెస్‌వే అయ్యేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాయలసీమ వాసులకు రాజధాని దూరంగా ఉందనే భావన కలగకుండా చూడటం కోసం.... కడప, కర్నూలు నుంచి వచ్చే రహదారులతో కలిపి అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేను గత ప్రభుత్వం ప్రతిపాదించింది. తొలి దశలో ప్రధాన రహదారి నిర్మించాలని అధికారులు భావించారు. మలిదశలో... కడప నుంచి 88 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 20 కిలోమీటర్ల చొప్పున నాలుగేసి వరుసల రహదారులు వచ్చి అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేలో కలిసేలా గతంలో ప్రతిపాదించారు.అయితే ఇటీవల ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై సమీక్షించిన సీఎం.... తొలిదశలోనే కడప నుంచి వచ్చి కలిసే మార్గాన్నీ పూర్తి చేయాలని సూచించారు. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతామని ఎన్హెచ్ఏఐ సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలోనే... అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేలో మార్పును జాతీయ రహదారుల అధికారులు ప్రతిపాదించగా.... ముఖ్యమంత్రి దానికి ఆమోదం తెలిపారు. అయితే ఈ ఎక్స్‌ప్రెస్‌వేను చిలకలూరిపేట బైపాస్‌లో కలిపేలా తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేసేందుకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మొదట ఈ ఎక్స్‌ప్రెస్‌వే... అమరావతి చుట్టూ నిర్మించాలనుకున్నా.. ఔటర్ రింగ్‌రోడ్డులో కలిసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఓఆర్ఆర్ నిర్మాణంలో ముందడుగు పడకపోవటం వల్ల ఎక్స్‌ప్రెస్‌వేను ఎక్కడ కలపాలనే విషయంపై సుదీర్ఘంగా ఆలోచించిన అధికారులు... చివరకు చిలకలూరిపేట దగ్గర నిర్మిస్తున్న బైపాస్‌లో కలిపేలా తాజా ప్రతిపాదనలు అందించారు.
గత కొంతకాలంగా రాజధాని మార్పుపై అనేక వదంతులు వస్తున్న నేపథ్యంలో... తాజా నిర్ణయం వెనుక ఏదైనా నిగూఢార్థం ఉండే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే భూసేకరణ వ్యయం తగ్గించేందుకే ఈ కొత్త ప్రతిపాదన చేశామని అధికారులు అంటున్నారు.
ఇవీ చూడండి:
క్షిపణి పరీక్షా కేంద్రానికి లైన్ క్లియర్... షరతులు వర్తిస్తాయి