జైలో భరో కార్యక్రమంలో రైతులు, మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్ పాటించారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. జైలు భరో కార్యక్రమంలో తమపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలంటూ రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
అమరావతి పరిరక్షణ లక్ష్యంగా రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు చేపడుతున్న నిరసనోద్యమం 320వ రోజు కొనసాగింది. తుళ్లూరు, మందడం, రాయపూడి, కృష్ణాయపాలెం, వెలగపూడిలో రహదార్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. కృష్ణాయపాలెం రైతులను విడిచిపెట్టాలని... ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టడమేంటని వారు ప్రశ్నించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రహదారిపై రైతుల నిరసన తెలిపారు. మహిళలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. రైతులు, మహిళలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాకపోకలకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు సూచించటంతో కొద్దిసేపటి తర్వాత రైతులు తమ ఆందోళన విరమించారు.
అబ్బరాజుపాలెంలో దళిత ఐకాస ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే, తెదేపా గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస కన్వీనర్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. తుళ్లూరు ధర్నా శిబిరంలో విజయవాడ మాజీ ఎంపీ గద్దె అనురాధ పాల్గొన్నారు. రాజధాని అమరావతిని కాపాడాలంటూ లింగాయపాలెంలో రైతులు, మహిళలు పోతురాజు, పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించారు. ప్రభుత్వం మనసు కరిగేటట్లు చూడాలని కోరారు. రైతులు గెలవాలి... అమరావతి నిలవాలంటూ రైతులు, మహిళలు రాజధాని గ్రామాల్లో నినాదాలతో హోరెత్తించారు. అమరావతిని కాపాడుకునేందుకు ఎన్ని రోజులైనా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి