అమరావతి రైతులు, జేఏసీ నేతల దిల్లీ పర్యటన ముగిసింది. మూడు రోజులపాటు సాగిన పర్యటనలో పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన అమరావతి రాజధాని రైతులు.. ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట వరకు నిలిపివేసిన హైవేను అమరావతికి ఎక్స్‌ప్రెస్‌వేగా అనుసంధానించాలని కోరారు. అమరావతి రైతులకు మద్దతుగా నిలిచి వారి వెంట గడ్కరీ వద్దకు వెళ్లిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి.., కేంద్రం నుంచి రావాల్సిన సంస్థలను ఏర్పాటు చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. తమ వినతులపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు అమరావతి రైతులు స్పష్టం చేశారు.
అంతకు ముందు అమరావతి రైతులు కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌ని కలిశారు. క్రీడాశాఖ నుంచి స్థలం పొందిన సంస్థలు నిర్మాణాలు చేపట్టాలని మంత్రిని కోరారు. కేంద్ర క్రీడాశాఖకు అమరావతిలో 7 ఎకరాలు కేటాయించారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మూడేళ్లుగా అమరావతి నిర్మాణాలు ఆగిపోయాయని తెలిపారు. హైకోర్టు తీర్పును అనురాగ్ ఠాకూర్‌కు వివరించినట్లు రైతులు మీడియాతో వెల్లడించారు.
రేణుకా చౌదరి, సుంకర పద్మశ్రీతో కలిసి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసిన అమరావతి రైతులు.. తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రకే రెండో రాజధాని అవసరం లేదని.. చిన్న రాష్ట్రమైన ఏపీకి 3 రాజధానులు ఎందుకో అర్థం కావట్లేదని అన్నారు. అమరావతి రైతుల ఆందోళనకు పూర్తిగా మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు. దిల్లీ పర్యటన ముగించుకొని తిరుగు పయనమైన అమరావతి రైతులు, జేఏసీ ప్రతినిధులకు దిల్లీ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వీడ్కోలు పలికారు.
ఇదీ చదవండి: 'మా టిడ్కో ఇళ్లు మాకు ఇప్పించండి'.. కేంద్ర మంత్రులకు అమరావతి రైతుల విన్నపం