మన దేశంలో పుట్టి, విద్యనభ్యసించి వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన కొందరు ఇక్కడి ప్రజలకు సాయం చేస్తూ తమ ప్రేమను చాటుతున్నారు. స్వదేశంలోని వారికి చేయూత అందించాలనే ఆలోచనతో 13 సంవత్సరాల క్రితం 36 మందితో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) ఏర్పడింది. ప్రస్తుతం ఇందులో ఐదు వేల కుటుంబాలు.. సుమారు 14 వేల మంది సభ్యులుగా ఉన్నారు. వారు సంపాదించిన మొత్తంలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.
మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వీసా పాస్ పోర్ట్ ఇతర అంశాలలో సహాయం అందించటం, చదువు మధ్యలో ఆపేసిన వారికి ఆర్థికంగా చేయూత అందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 12 కోట్ల రూపాయలు వేల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ రూపంలో ఆర్థిక సాయం చేసి వారి ఉన్నత విద్యాభ్యాసానికి తోడ్పాటును అందించారు.
ఈ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సుమారు 1300 మంది విద్యార్థులకు సుమారు 2 కోట్ల 60 లక్షల రూపాయల మొత్తాన్ని స్కాలర్షిప్ ద్వారా అందించినట్లు ఆప్త ప్రెసిడెంట్ జె.వి.వి. సుబ్రహ్మణ్యం తెలిపారు. 80 శాతానికి పైగా మార్కులు సాధించి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చదువు పూర్తయ్యే వరకు స్కాలర్ షిప్ రూపంలో సాయం చేస్తున్నామని చెప్పారు.
"తండ్రి అనారోగ్యంతో రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు. తల్లి కష్టపడి చదివిస్తోంది. ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించిన నాకు రెండేళ్లుగా స్కాలర్షిప్ అందించటం ఎంతో ఉపయోగకరంగా ఉంది. నేను కూడా ఉద్యోగం సంపాదించి నాలాంటి వారికి సాయం చేస్తాను. 'ఆప్త'కు చాలా చాలా ధన్యవాదాలు" - మెండు సంహిత, ట్రిపుల్ ఐటీ విద్యార్థిని
ఇదీ చదవండి: