రైలుమార్గాలు అభివృద్ధికి జీవనాడులు. ఏ ప్రాంతం పురోగమించాలన్నా... రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం అత్యవసరం. సమీపంలో విమానాశ్రయాలు, ఓడరేవులు కీలకం. ముఖ్యంగా రైలు మార్గాలు అత్యంత కీలకం. జల రవాణా తర్వాత రైల్వేలు చౌకైన రవాణా. కొన్నిదశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో ఒకటీ అరా తప్ప కొత్త రైల్వేమార్గాల ఏర్పాటు జరగలేదు. అమరావతి రాజధానిగా నిర్ణయించాక... కొత్తగా 3 రైల్వే లైన్లు మంజూరు అయ్యాయి. అవి కార్యరూపం దాలిస్తే అమరావతితోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కేవి. రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్నే మార్చే శక్తి రైల్వేలకు ఉంది. అమరావతితోపాటు గుంటూరు, విజయవాడ నగరాలకు దేశంలోని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానం పెరిగేది. కొత్తగా అభివృద్ధి చేసే అమరావతి రైల్వే స్టేషన్... ప్రయాణికుల రవాణాతోపాటు సరకు రవాణా కేంద్రంగా మారేది. వాణిజ్య పంటలు ఎక్కువగా పండే ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటు అయ్యేందుకు దోహదం చేసేది.
2017-18 కేంద్ర బడ్జెట్లో 2680కోట్లు
అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు మూడేళ్ల క్రితం 2017-18 కేంద్రబడ్జెట్లో 2 వేల 6వందల 80 కోట్ల అంచనాతో 3కొత్త రైల్వే లైన్లు మంజూరయ్యాయి. అమరావతికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు దేశంలోని వివిధ నగరాల నుంచి రాకపోకలు సులభతరం చేసే ప్రాజెక్టు అది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి, హైదరాబాద్, దిల్లీ నుంచి అమరావతికి వచ్చేవారికి దూరభారం తగ్గిస్తుంది. దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలోని అతిపెద్ద జంక్షన్ విజయవాడపై విపరీతంగా పెరిగిన ఒత్తిడిని... అమరావతి రైల్వే లైన్ తగ్గించేది. రాజధానిని ఇక్కడి నుంచి మారిస్తే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.
కేంద్రం మంజూరు చేసిన 3 రైలు మార్గాల్లో ప్రధానమైంది నంబూరు-ఎర్రుబాలెం రైల్వేలైన్. గుంటూరు సమీపంలోని నంబూరు వద్ద మొదలై... అమరావతి మీదుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం వద్ద కలుస్తుంది. ఈ రైల్వేలైన్‌ను కృష్ణా నదీ మీదుగా 2 వరుసల రైలుమార్గంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. నంబూరు- ఎర్రుపాలెం రైల్వేలైన్ ఏర్పాటైతే అటు దిల్లీ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లు విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు. దిల్లీ నుంచి తమిళనాడు, కేరళ తదితర దక్షిణాదిరాష్ట్రాలకు వెళ్లే రైళ్లకూ దగ్గరదారి అవుతుంది. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య వయా విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయం అవుతుంది. సికింద్రాబాద్-గుంటూరు వయా బీబీనగర్ మార్గంలో సత్తెనపల్లి, పెదకూరపాడు తర్వాత నల్లపాడు నుంచి రైళ్లు గుంటూరుకు వెళ్తాయి. ప్రస్తుతం రైల్లో గుంటూరుకు వచ్చినవారు రోడ్డు ద్వారా అమరావతి వెళ్లాల్సి వస్తోంది. అమరావతి-పెదకూరపాడు రైలుమార్గం నిర్మిస్తే గుంటూరు వెళ్లే అవసరం లేకుండా అమరావతికి చేరుకోవచ్చు.
ఏ ప్రాంతం నుంచైనా చేరుకోవచ్చు..
రాయలసీమలోని గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు ప్రస్తుతం నరసరావుపేట, నల్లపాడు మీదుగా గుంటూరు వెళ్తున్నాయి. గుంటూరు నుంచి మళ్లీ రోడ్డు మార్గంలో అమరావతి వెళ్లాల్సి వస్తోంది. నరసరావుపేట, సత్తెనపల్లి మధ్య, పెదకూరపాడు-అమరావతి మధ్య కొత్త రైలు మార్గాలు నిర్మిస్తే నేరుగా అమరావతి చేరుకోవచ్చు. ప్రస్తుతం అమరావతికి రావాలంటే విజయవాడ లేదా గుంటూరు నుంచి రోడ్డుమార్గాన రావల్సి వస్తోంది. 3 కొత్త రైలుమార్గాల నిర్మాణం జరిగితే దేశంలో ఏప్రాంతం నుంచైనా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు కావడం, స్థలం సమస్య లేకపోవడంతో వడ్లమాను సమీపంలో భారీ రైల్వే టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్త రైలు మార్గాల్లో ప్రతి 5 కి.మీ.కు ఒక స్టేషన్ ప్రతిపాదించారు. ఎర్రుపాలెం నంబూరు మార్గంలో పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్త పేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు. అమరావతి నరసరావుపేట మార్గంలో నిడుముక్కల, రావెల, చాగంటివారిపాలెం. నంబూరు-అమరావతి-ఎర్రుపాలెం మధ్య 56.8 కి.మీ.మార్గాన్ని రెండులైన్లతో 2 వేల 69 కోట్లతో చేపట్టాలని తొలుత నిర్ణయించారు. తర్వాత వెయ్యి 7వందల 32కోట్ల వ్యయంలో సింగిల్ లైన్‌గా కుదించారు. పెదకూరపాడు, అమరావతి, సత్తెనపల్లి-నరసరావుపేట మార్గాల్ని వాయిదావేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కేంద్రంపై ఒత్తిడి తెస్తే అసలు ప్రతిపాదన ప్రకారం అన్ని ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తాయి. ఇలాంటి తరుణంలో రాజధానిని తరలిస్తే......మంజూరైన రైల్వే లైన్ల పనులు నిలిచిపోయి రాష్ట్ర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.
మూడు లైన్లు పూర్తయితే బహుళ ప్రయోజనాలు
అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు ప్రతిపాదించిన 3 కొత్త రైల్వేలైన్లు పూర్తయితే బహుళ ప్రయోజనాలుంటాయి. నగరంలో కొన్నేళ్లపాటు ప్రభుత్వ, ప్రైవేటురంగంలో నిరంతరం నిర్మాణాలు జరుగుతాయి. రాజధాని ఇక్కడే కొనసాగించి రైల్వేలైన్లు వేగంగా పూర్తి చేయగలిగితే, నిర్మాణ సామగ్రితో పాటు కొత్తగా వచ్చే వ్యాపార, వాణిజ్య సంస్థలకు, ఇతర అవసరాలకు కావాల్సిన వస్తువులు, సామగ్రి రవాణా తేలికవుతుంది. రాజధానికి వ్యక్తిగత పనులు, వ్యాపారం, ఉపాధి కోసం వచ్చేవారు నేరుగా అమరావతికి చేరుకోగలుగుతారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి వాణిజ్య, వ్యాపార పంటలకు డెయిరీ, ఆక్వా ఉత్పత్తులకు ప్రసిద్ధి. అమరావతిని కేంద్రంగా చేసుకుని రైలుమార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు వాటిని రవాణాచేసేందుకు వీలవుతుంది. ఏపీలోని అన్ని ప్రాంతాలకూ అమరావతి మీదుగా దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.
విజయవాడ, విశాఖ మార్గాల్లో ఇప్పటికే సామర్థ్యానికి మించి రైలు నడుస్తున్నాయి. చెన్నై-కోల్‌కతా మార్గంలో ఉండటమే ప్రధాన కారణం. ప్రయాణికుల రైళ్లు, సరుకు రవాణాతో ట్రాక్ కిక్కిరిసిపోతోంది. ప్రయాణికుల అవసరాలు పెరిగినా.........కొత్త రైళ్లకు డిమాండ్ ఉన్నావిశాఖ లేదా విజయవాడ నుంచి రైల్వేశాఖ కొత్తరైళ్లు నడపలేకపోతోంది. రైలు బయల్దేరే స్టేషన్ లేదా....గమ్యస్థానం స్టేషన్లో వాటి నిర్వహణ చేపట్టాలి. విశాఖలో సామర్ధ్యం తక్కువగా ఉండటంతో ఏపీ ఎక్స్‌ప్రెస్ నిర్వహణ దిల్లీలో చేస్తున్నారు. గతంలో విశాఖ నుంచి బయల్దేరే లేదా గమ్యస్థానంగా ఉండే రైళ్లను సాంకేతిక కారణాలను సాకుగా చూపి భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా వరకు పొడిగించారు. అమరావతిలో భారీ రైల్వేస్టేషన్ నిర్మిస్తే రైళ్ల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పించవచ్చు. రాజధానిని విశాఖకు తరలిస్తే......అక్కడి జనాల అవసరాలకు తగ్గట్లుగా రైళ్లు పెంచడం సాంకేతికంగా సవాల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అమరావతి రాజధానిగా ఉంటే ఎన్ని కొత్త రైళ్లు వేయడానికైనా అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇదీ చదవండి : పోలీసుల తీరుపై 'ఎన్హెచ్ఆర్సీ'లో ఎంపీ కనకమేడల ఫిర్యాదు