అమరావతి ఉద్యమం ఏడాది కావొస్తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి తెదేపా నేత తెనాలి శ్రావణ్ కుమార్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాసయాదవ్, సీపీఐ నేత జంగాల అజయ్ కుమార్తో పాటు పలువురు ఐకాస నేతలు హాజరయ్యారు.
ఈనెల 12 నుంచి 17 వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలని కార్యాచరణ ప్రకటించారు. అందులో భాగంగా ఈ నెల 12 న గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతామని ఐకాస నేతలు తెలిపారు. 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా గత ఏడాది నుంచి రైతులు ఉద్యమం చేస్తుంటే.. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని అమరావతి పరిరక్షణ ఐకాస కన్వీనర్ శివారెడ్డి విమర్శించారు.
ప్రపంచంలో ఎక్కడ లేనివిధంగా.. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరపైకి తీసుకువచ్చి ఏడాది కావొస్తుందని తెదేపా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. ఏకైక రాజధాని ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం మూడు రాజధానల ఆలోచన ఉపసంహరించుకోవాలన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో 3 రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేపడుతున్నారని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు.
ఇదీ చదవండి