AMARAVATI FARMERS : రాజధాని రైతులు తలపెట్టిన అమరావతి-అరసవల్లి మహాపాదయాత్ర 23వ రోజున ఉత్సాహభరితంగా సాగింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం నుంచి యాత్ర ప్రారంభమైన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. తాడేపల్లిగూడెం మీదుగా పెంటపాడు వరకు దాదాపు 14 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. అమరావతి రైతులకు ఎక్కడికక్కడ స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. పాదయాత్ర సాగుతున్న మార్గంలో.. స్థానికులు రైతులకు మద్దతుగా పాదయాత్రలో కలసి నడిచారు.
తాడేపల్లిగూడెంలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఫేక్ యాత్రికులంటూ, రియల్ ఎస్టేట్ యాత్ర అంటూ ఫ్లెక్సీలపై రాతలు రాశారు. స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు.. నల్ల బెలూన్లు ఎగరవేసి పాదయాత్రపై నిరసన వ్యక్తం చేశారు. దీనిపై రైతులు మండిపడ్డారు. ఐడీ కార్డులను ప్రదర్శించి.. అమరావతి నినాదాలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తున్న తాము నిజమైన కర్షకులమని.. తేల్చిచెప్పారు.
రౌండ్ టేబుల్ సమావేశాల్లో మంత్రులు.. అమరావతి రైతులపై ఆరోపణలు చేయడాన్ని.. రైతులు తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో మూడు రాజధానులపై ఉన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర చేస్తున్నవారిపై.. మంత్రులు, వైకాపా ప్రజాప్రతినిధులు వాడుతున్న భాష మంచిది కాదని హితవు పలికారు. పెంటపాడు చేరుకున్న రాజధాని రైతులు.. రాత్రికి అక్కడే బస చేసి.. బుధవారం ఉదయం ఆ గ్రామం నుంచి యాత్రను ప్రారంభిస్తారు.
ఇవీ చదవండి: