AMARAVATI FARMERS రాజధానిని ఇష్టారాజ్యంగా మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. అమరావతే రాష్ట్రానికి రాజధాని అని.. ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది. రైతుల ప్లాట్లను నెల రోజుల్లో అభివృద్ధి చేయాలని.. ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ తీర్పు వచ్చి 6నెలలు కావొస్తున్నా అమల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదు.
పైగా ఇప్పుడు హైకోర్టు తీర్పుపై సమీక్షకు వెళ్తామని, సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీనిపై రాజధాని రైతులు తీవ్రంగా మండి పడుతున్నారు. కేసు కోర్టుల్లో విచారణకు రావడానికి పట్టే సమయాన్ని ప్రభుత్వం అనుకూలంగా మార్చుకుని.. ఎన్నికల వరకూ కాలయాపన చేసేందుకు ఎత్తుగడ వేసిందని ఆరోపిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని.. అమరావతి రైతులు అనుమానిస్తున్నారు. అందుకే సుప్రీంకు వెళ్తామని చెబుతున్నారని అంటున్నారు. కోర్టు తీర్పుని ప్రభుత్వం అమలు చేస్తుందనే నమ్మకాన్ని కోల్పోయిన రైతులు.. మళ్లీ రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. అమరావతి నుంచి అరసవిల్లి వరకూ చేపట్టబోయే మహాపాదయాత్ర ద్వారా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి.. ప్రజలకు బిల్డ్ అమరావతి ఆవశ్యకతను వివరిస్తామని చెబుతున్నారు.
ఇవీ చదవండి: