అమరావతి రైతుల అరెస్టులు, చేతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా జైల్ భరో కార్యక్రమం చేపడితే.. పోలీసులు హింసాత్మకంగా వ్యవహరించారని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. అమరావతి రైతులతోపాటు జైల్ భరో కార్యక్రమంలో పాల్గొన్న వారిపైనా కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ గుంటూరు లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
జైల్ భరో కార్యక్రమంలో పోలీసులు ఇష్టానుసారంగా వ్యహరించారని.. పోలీసులు పెట్టిన కేసులను సవాల్ చేస్తూ ప్రైవేటు కేసులు పెడతామని అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి జైల్ వద్దకు వస్తే మహిళలు అని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని మహిళ ఐకాస నాయకులు డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా పోలీసులు తమ తప్పులను గ్రహించి కేసులు ఎత్తివేయాలన్నారు. అమరావతి ఉద్యమాన్ని అణిచివేయడానికి పోలీసులే అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారని ఐకాస నాయకులు శ్రీనివాసరావు అన్నారు. రైతన్నలపైన కేసులు పెట్టి వేధిస్తున్న సీఎం జగన్, హోం మంత్రి సుచరిత రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి; రేపు ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన